Site icon TeluguMirchi.com

ఎన్నికలు దగ్గర పడుతున్నాయా?

elections-2014-in-indiaవచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్ర శాసనసభకు, లోక్ సభకు ఎన్నికలు జరగాల్సి వుంది. ఎందుకంటే 15వ లోక్ సభ గడువు మే౩౧ వరకు ఉంది. ఎన్నికల పోలింగ్ తేదీకి, లెక్కింపునకు మధ్య కనీసం పది నుంచి ముఫై రోజులు గడువు వుంటున్న పరిస్థితుల్లో, దశలవారీ పోలింగ్, రీపోలింగ్, రీకౌంటింగ్ తప్పనిసరి అవుతున్న దృష్ట్యా గడువుకు రెండు మూడు నెలలు ముందుగానే ఎన్నికలు జరగడం మామూలే. ఆ విధంగా చూసుకుంటే వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరిగే అవకాశం వుందనుకోవచ్చు. అయితే వివిధ కారణాల రీత్యా చూసుకుంటే కచ్చితంగా జనవరి మాసానికి కాస్త అటు ఇటుగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

నిజానికి దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరపాలనుకున్నప్పుడు ముందుగా చూసేది వాతావరణ పరిస్థితులు. ఎందుకంటే, దీనిపైనే ఓటింగ్ శాతం ఆధారపడి వుంటుంది. వర్షాకాలం అనంతరం ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు. ఎందుకంటే పండగలు, వ్యవసాయం వంటి పరిస్థితులు అడ్డంగా వుంటాయి. వచ్చే ఏడాది మార్చి దాటనిస్తే ఎండలు ముదిరే ప్రమాదం ఉంది. దానాదీనా ఫిబ్రవరి, మార్చి ఎన్నికలకు అనువైన కాలంగా భావించవచ్చు. అంటే దగ్గర దగ్గర పది నెలల సమయం. కానీ కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ ఇంతవరకు ఆగుతుందా అన్నది అనుమానంగా వుంది. ఎందుకంటే ప్రతిపక్ష బిజెపి ఏమంత బలంగా లేదు. ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. మరోపక్క రోజుకో కుంభకోణం బయటపడుతూ కాంగ్రెస్ పార్టీకి అంటుకున్న అవినీతి బురద పెరుగుతోంది కానీ తరగడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో పది నెలల కాలం వేచివుండే కన్నా, మరింత ముందుగా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది. అన్న ఆలోచన కాంగ్రెస్ లో ఉంది. కానీ ముందుగా ఎన్నికలకు వెళ్తే, ఎందుకు వెళ్తున్నట్లు? అన్న దానికి సమాధానం చెప్పుకోవాల్సి వుంటుంది. పైగా ఒక్క రానున్న ఆరు నెలల్లో సరియైన వాతావరణ పరిస్థితులు వుండవు. దానాదీనా తప్పని సరిగా కాంగ్రెస్ ఫిబ్రవరి వేళకే సిద్ధం కాకతప్పదు. అందుకే ఈ పది నెలల వ్యవధిని పార్టీని, పార్టీ అధికారంలో వున్న చోట్ల ప్రభుత్వాలను పటిష్టం చేయడానికి సిద్ధమవుతోంది.

ఇప్పుడు అందులో భాగంగానే ఢిల్లీలో అన్ని రకాల కసరత్తులు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రివర్గం, రాష్ర్ట మంత్రివర్గం, పిసిసి, తదితర వ్యవహారాలన్నింటిని ఒకేసారి పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే నాయకులంతా ఢిల్లీలో బిజీగా వున్నారు. అవినీతి బురద దాస్త బలంగానే కడుక్కునేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ, ఈ విషయమై తన పోరాటాన్ని ఒక్కసారి ఉధృతం చేయడం వెనక కారణం కూడా ఇదే. కాంగ్రెస్ ఎలాగూ ఈ ఆలోచనలో వునట్లు వార్తలు అందడంతో చంద్రబాబు తెలివైన అడుగువేశారు. గవర్నర్ ను, ఢిల్లీ పెద్దలను కలిసి, అవినీతి నేతలను తప్పించాలంటూ డిమాండ్ చేయించారు. దీని వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. తప్పిస్తే, ఆ క్రెడిట్ తెలుగుదేశానికి వెళ్తుంది. తప్పించకుంటే, ప్రక్షాళన కుదరదు. ఇదే సమయంలో రాష్ర్ట రాష్ర్టా పార్టీలు కూడా ఎన్నికల దిశగా కదులుతున్నాయి.

తెరాస అధినేత తెలంగాణా వచ్చే ఎన్నికల తరువాతే, అని ప్రకటించేశారు. తెలుగుదేశం పార్టీ కూడా మహానాడు పేరుతో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి శ్రీకారం చుట్టింది. చంద్రబాబు కూడా తన వ్యూహాలకు పదను పెడుతున్నారు. పార్టీ వారసత్వం సమస్యలు తెచ్చి పెడుతుంది ఆయన గమనించారు. ప్రస్తుతానికి లోకేష్ ను తెరవెనక్కు పంపేసినట్లే కనిపిస్తోంది. మరో పక్క నందమూరి కుటుంబం పార్టీ దాటకుండా ప్రయత్నాలు షురూ చేశారు. హరికృష్ణ పార్టీ దాటడం వల్ల ఆయనకు వచ్చిన నష్టం లేదు. కానీ హరికృష్ణ వెనక జూనియర్ ఎన్టీఆర్ వుండడం, అతగాడికి చిరంజీవి కుటుంబంతో మంచి సంబంధాలు వుండడం ఇక్కడ గమనించాలి. అందుకే బాలకృష్ణను అట్నుంచి నరుక్కురమ్మని పురమాయించారు. ఇది ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడలి.

ఇలా అన్ని విధాలా దేశంలో, రాష్ట్రంలో, పార్టీల్లో ఎన్నికల వాతావరణం ఏర్పడిపోయింది. బహుశా దీని ప్రభావం మరికొన్ని జంప్ లు, గోడగెంతడాలకు ఆస్కారం కలిగించవచ్చు. కానీ తెరాస, వైకాపాల్లో జంప్ జిలానీలు చేరడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. వీటిని దృష్టిలో వుంచుకుని, గెంతేవారు, చేర్చుకునేవారు కాస్త ఆచితూచి వ్యవహరించే అవకాశం వుంది. ఎలాగైతేనేం రానున్న ఆరునెలల కాలం రాజకీయంగా భలే రంజుగా వుంటుంది.

Exit mobile version