Site icon TeluguMirchi.com

సీఎంతో ఏపీ ఎన్జీవోల చర్చలు విఫలం !

ashok babuఏపీ ఎన్జీవోలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన చర్చల్లో ఏపీఎన్జీవోలు ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన అనంతరం ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.. సమైక్యాంధ్రపై స్పష్టమైన హామి లభించకపోవడంతో.. సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని వెల్లడించారు.

ప్రజల శ్రేయస్సు కోసం సమ్మెను విరమించాలని ఉద్యోగులను ముఖ్యమంత్రి కిరణ్, మంత్రులు కోరారు. అంతేకాకుండ.. రానున్న రెండుమూడు రోజుల్లో రాష్ట్రానికి తుఫాన్ వచ్చే అవకాశం వున్నందున సమ్మె విరమణ ఆలోచించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అయితే, తుఫాన్ సంబవిస్తే.. సమ్మెలో వుండి కూడా సహాయక చర్యల్లో పాల్గొంటామని ఏన్జీవో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి విభజన తీర్మానం రెండు సార్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారని సీఎం తెలిపినట్టు అశోక్ బాబు చెప్పారు. ఒకసారి అభిప్రాయ సేకరణ కోసం, మరోసారి తీర్మానం కోసం రెండు సార్లు వస్తుందని అన్నట్టు చెప్పారన్నారు. ఆ సమయంలో అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించేందుకు కృషి చేస్తామని సీఎం తమకు హామీ ఇచ్చారని అన్నారు. అయితే దీనికి ఉద్యోగ సంఘాల నేతలు ససేమిరా అన్నారని తెలిపారు.

సమైక్యవాదిగా ముఖ్యమంత్రిని గౌరవిస్తామని… కానీ ఆయనొక్కరే ఏమీ చేయలేరని ఏపీఎన్జీవోలు తెలిపారు. విభజనను అడ్దుకుంటే ఏవిధంగా అడ్దుకుంటారు.. ? అధేవిధంగా విభజన సమయంలో ఉద్యోగ సమస్యలను ఎలా తీరుస్తారు..? ఏ విధంగా సీమాంధ్రలకు న్యాయం చేస్తారనే విషయాలపై స్పష్టమైన హామి వచ్చేవరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేశారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమింపజేసేందుకు మరోసారి చేసిన ప్రయత్నం బెడసికొట్టింది. దీంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.

Exit mobile version