గవర్నర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం

CBN-Narsimhaరాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు తప్పకుండా రావాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్‌ను కోరారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు స్వయంగా పుష్కరాల ఆహ్వానపత్రికను అందించిన ముఖ్యమంత్రి 3 జిల్లాలలో ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను వివరించారు. పుష్కరాలు జరిగే 12 రోజులు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్నిచర్యలు తీసుకున్నామని సీయం చెప్పారు. నిరుడు గోదావరి పుష్కరాలలో రెండు నదుల అనుసంధానం, పట్టిసీమ నిర్మాణంపై సంకల్పం తీసుకున్నామని, కృష్ణా పుష్కరాలలో రాష్ట్రంలో మరిన్ని నదుల అనుసంధానం సాధించి రాష్ట్రాన్ని కరవురహితంగా తీర్చిదిద్దాలనే సంకల్పం తీసుకోబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

తొలిరోజు ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే ముగింపు ఉత్సవాన్ని అందరికీ గుర్తుండిపోయేలా మరింత ఉత్సాహభరితంగా జరుపబోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గవర్నర్ ముగింపు వేడుకల్లో పాల్గొంటే ఆ కార్యక్రమానికి వన్నె తెచ్చినట్టవుతుందని అన్నారు. పుష్కరాల్లో తప్పకుండా పాల్గొంటానని గవర్నర్ ముఖ్యమంత్రికి చెప్పారు. ఇరువురూ కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై దాదాపు 45 నిమిషాలు మాట్లాడుకున్నారు. తనకు ఆహ్వానం అందించినందుకు ముఖ్యమంత్రికి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.