Site icon TeluguMirchi.com

అమ్మ ఆమోదించిందా.. ?

soniaరాష్ట్ర విభజనపై జీవోఎం కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నివేదికకు తుది మెరుగులు దిద్ది కేబినేట్ కు పంపడామే తరువాయి. ఎలాంటి రాజ్యాంగ సవరణలు లేకుండానే బిల్లును ఆమోదింపజేసేందుకు జీవోఎం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే..20పేజీలతో కూడిన నివేదికను సోమవారం జీవోఎం సభ్యులు అధినేత్రి సోనియా గాంధీని ముందుంచినట్లు తెలుస్తోంది. అయితే, అన్ని అంశాలపై స్పష్టత వచ్చినప్పటికినీ.. హైదారాబాద్ విషయంలోనే జీవోఎం తుది నిర్ణయానికి రానట్లు సమాచారం.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎవరెన్ని చెప్పిన రాష్ట్ర విభజన చేయాల్సిందేనని కంకణం కంటుకొని వున్న సోనియాగాంధీ జీవోఎం అందించిన నివేదికను ఆమోదించిందా.. ? లేదా.. ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విభజన విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న ’అమ్మ దయ’ వుండాలని కాంగ్రెస్ నేతలే అంటుంటారు కాబట్టి సోనియా చెప్పిందే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయ్. ఈ నేపథ్యంలో.. నిన్న నివేదికపై అమ్మ ఎలా స్పందించారన్న దానిపైనే.. రాష్ట్ర విభజన రూపు రేఖలు ఆధారపడి వుంటాయనడం లో అతిశయోక్తి లేదు.

శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లును తీసుకురావాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఆ దిశగా వడివడిగా పావులు కదుపుతోంది. ఈరోజు అనధికారికంగా జీవోఎం సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం వుంది. ఇక రేపు సాయంత్రం 4.30నిమిషాలకు జీవోఎం అధికారికంగా సమావేశం అవుతోంది. ఇదే జీవోఎం చివరి సమావేశం అవడం విశేషం. ఈ సమావేశంలో నివేదికను ఫైనల్ చేసి క్యాబెనెట్ ముందు పంపుతుంది. అయితే, ఈవారం జరిగే కేబినేట్ ముందుకు టీ-బిల్లు వస్తుందా.. ? లేదా.. కేబినేట్ ను ప్రత్యేకంగా సమావేశ పరచి ముసాయిదాను, బిల్లును ఆమోదిస్తారా.. ? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

బిల్లు కేబినేట్ కు ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడు పార్లమెంట్ కు వెళుతుంది అనే విషయాలను పక్కపెడితే.. విభజన విషయంలో కీలకంగా వున్న అంశాలపై కేంద్రం ఇప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపడానికి కూడా కేంద్రం ఇష్టపడటం లేదు. కావాలంటే.. పోలవరం ముంపునకు గురయ్యే కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలిపే అవకాశం లేకపోలేదు.

ఇక విభజన విషయంలో అడ్డుగా మారుతోందని అందరు అంటున్నట్లు 371డీ ని సవరించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. ఇదే విషయాన్ని నిన్న సోనియా గాంధీతో భేటీ అనంతరం జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 371డీని సవరించకుండానే హైదారాబాద్ లోని కొన్ని కీలకాంశాలను కేంద్రం చేతిలో వుంచుకోవచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం.

మొత్తానికి విభజన విషయంలో.. జీవోఎం, కాంగ్రెస్ పెద్దలు అమ్మ సోనియా గాంధీ చెప్పిన డైరెక్షన్ లోనే నడుస్తున్నారని ఢిల్లీ వర్గాల మాట.

Exit mobile version