కొనసాగుతున్న రాష్ర్ట బంద్ !

state bandhవిద్యుత్ ఛార్జీల పెంపు, కరెంట్ కోతలు నిరసిస్తూ.. వామపక్షాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతోంది. వామపక్షాలు చేపట్టిన బంద్ కు కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయపార్టీలు మద్ధతు ఇవ్వడంతో.. బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పాక్షికంగా స్థంభించింది. హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద ఈ తెల్లవారుజామున సీపీఎం, సీపీఐ నేతలు ధర్నా చేపట్టారు. బస్సులు నడవకుండా అడ్డుకోవడమే కాకుండా.. బస్సుడిపోకు తాళం వేసే ప్రయత్నాలు చేయడంతో… వామపక్ష నేతలు రాఘవులు, నారాయణ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో హయత్ నగర్, ఉప్పల్, ముషీరాబాద్ డిపోల ముందు విపక్షాలు, టీడీపీ, బీజేపీ నేతలు బైఠాయించారు. దీంతో నగరంలో దాదాపుగా బస్సులు డిపోలకే పరిమతమయినట్లు తెలుస్తోంది. కాగా, నెల్లూరు, విజయవాడలో పలువురు నేతలు పార్టీలకు అతీతంగా బంద్ నిర్వహిస్తున్నారు. మరోవైపు బంద్ నేపథ్యంలో కడప జిల్లాలోని 8 డిపోల పరిధిలో 920 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్ స్టేషన్ లో బస్సులు బయటికి కదలకుండా సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించాలని డిమాండు చేశారు.

దాదాపుగా అన్ని జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. వామపక్ష నేతలతో ఇతర పార్టీ నేతలు కలిసి బంద్ ను విజయవంతం చేసే దిశగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే నిరసన వ్యక్తం చేస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా, కొంతమంది స్వచ్ఛంధంగా విద్యా, వ్యాపార సంస్థలు మూసివేసి బంద్ కు మద్దతు తెలుపుతున్నారు. పార్టీ నేతలే బలవంతంగా కొన్ని దుకాణాలను మూసివేయిస్తున్నారు. బంద్ ఎలా కొనసాగుతున్నా ఈ ప్రభావం మాత్రం ప్రయాణికులపై పడింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.