తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పదో తరగతి విద్యార్థులను అయోమయంలో పడేసింది. ఇప్పటికే జరగాల్సిన పరీక్షలు వాయిదా పడడంతో మళ్లీ ఎప్పుడు పెడతారో అనే టెన్షన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తి కాగానే పరీక్షలు నిర్వహిస్తామని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు మోడీ మే 03 వరకు లాక్ డౌన్ పొడిగించడం తో మరోసారి స్టూడెంట్స్ గందరగోళం లో పడ్డారు.
ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నామని, పరీక్షలు జరిగే వరకు విద్యార్థులు క్లాసులను ఆన్‌లైన్ ద్వారా సప్తగిరి ఛానల్ ద్వారా వినాలని సూచించారు. విద్యార్థులు ఇంటి వద్దే ఉండి సప్తగిరి ఛానల్ ద్వారా రోజుకు రెండు గంటల పాటు ఉదయం 10 గంటల నుంచి 11 గంటలవరకు , సాయంత్రం 4 గంటలనుంచి 5 గంటల వరకు పాఠాలను వినాలని చెప్పారు. పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి? సబ్జెక్టులను ఎలా అర్థం చేసుకోవాలి? తదితర అంశాలను విద్యామృతం అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తెలియజేస్తున్నట్లు తెలిపారు.