కరోనా కట్టడి లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండగా..కేంద్రం కొన్ని సడలింపులు చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ ఆదివారం తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
* కరోనాపై ప్రజల్లో భయాన్ని పోగొడుతూ భౌతిక దూరం లాంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ద్వారా వైరస్‌తో సమర్థంగా పోరాడగలమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ తాజా పరిస్థితి గురించి వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ సమావేశంలో వివరించారు.
* విదేశాల్లో చిక్కుకుపోయిన వారు సోమవారం నుంచి ఏపీకి రావటం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అమెరికా నుంచి వచ్చే ప్రవాసులు ముంబై, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లోని విమానాశ్రయాలకు చేరుకుంటారు.
* లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలోకి రాకపోకలు, కదలికలు ప్రారంభమయ్యాక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అనుసరించాల్సిన హెల్త్ ప్రొటోకాల్‌పై సమావేశంలో విస్తృతంగా చర్చించారు వీటితో పాటు పలు అంశాల గురించి మాట్లాడారు.