పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ఈ రోజు ప్రతిపక్షాల బంద్‌కు ప్రజలు రోడ్లమీదికొచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించాలని, ప్రయాణికులకు ఉపశమనం ఇవ్వడానికి చర్యలు చేపట్టుతున్నారని నివేదికలు తెలిపాయి. అయితే ఇప్పుడు వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు.
విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయి. వ్యాట్ తగ్గింపుతో రాష్ట్రానికి రూ.1120 కోట్ల ఆదాయం తగ్గనుంది.
చమురు ధరల పెంపుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. ‘‘గడిచిన నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత చమురు సంస్థలు, పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులేకుండా పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు పెరగడం వల్ల రాష్ట్రాల వ్యాట్ రేట్లు పెంచడం వల్ల డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించడంసాధ్యం కాదని పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు. ఈ ప్రశ్న వాస్తవానికి దూరంగాను, ప్రజల్ని మభ్యపెట్టేదిగా ఉంది. బాధ్యతా రహితమైన ఈ ప్రకటనను ఖండిస్తున్నాం.”
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసిస్తూ నేడు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రదర్శనలు చేపట్టుతుంటే.. ఒక్క వైకాపా మాత్రం ఆ నిరసనల్లో పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వైకాపాకు బాధ్యత లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే కేంద్రం కూడా పెట్రో ధరలు తగ్గించాలని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.