ఏపిలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు పరిమితి కి లోబడి బదిలీలకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మంత్రి-ఇన్ఛార్జ్ మంత్రి-కలెక్టర్ ఆధ్వర్యంలో బదిలీలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం..ఇప్పుడు పూర్తిగా శాఖ మంత్రి పర్యవేక్షణలో బదిలీలు చేయాలని స్పష్టం చేసింది. పూర్తి పారదర్శకంగా బదిలీలు ఉండాలని స్పష్టం చేసిన ప్రభుత్వం..రెవిన్యూ – సర్వీ సు శాఖల్లో మాత్రం బదిలీలకు ఆర్దిక శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖలు ప్రత్యేకంగా ఆర్దిక శాఖ అనుమతి ద్వారా బదిలీలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇక..ట్రెజరీ, అకౌంట్స్ అండ్ వర్క్స్, స్టేట్ ఆడిట్ వంటి శాఖల్లో మాత్రం బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ నెల పదహారో తేదీ నుంచి బదిలీల పై నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.