” రాష్ట్రం 16 నెలల పసికందు, దీనిని సాకడంలో ఎంతో జాగ్రత్తగా వ్వవహరించాలి. ఇప్పుడిప్పుడే నిలబడే పరిస్థితి వచ్చింది, ఇంకా నడిచే పరిస్థితి రాలేదు. కోలుకునేటప్పుడు దెబ్బకొట్టకండి, అభివృద్దికి అందరూ సహకరించండి.” తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజ్ఞాపన ఇది.
సీఎం మాట్లాడుతూ సమస్యలుంటే తప్ప కొన్ని పార్టీలకు మనుగడ లేదని, వాటి మనుగడ కోసం రాష్ట్రాన్ని, ప్రజలను సమస్యలతో సతమతం చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకుంటే మంచిది కాదని హెచ్చరించారు. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదంటూ అరాచకాలకు పాల్పడితే అణిచివేస్తానన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా లేకపోతే పెట్టుబడులు రావని, ఉపాధి అవకాశాలు పెరగవని, టూరిజం అభివృద్ధి చెందదని తెలిపారు. రాష్ట్రం అనేక ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వారికి పరపతి ఉంటే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి మరిన్ని నిధులు రాష్ట్రానికి వచ్చేలా చూడాలన్నారు. ఢీల్లీ వెళ్లి ప్రత్యేకహోదా కావాలని ఏనాడూ అడగని వారు ప్రస్తుతం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాజధాని రాకుండా అడ్డుకున్నారు, రాజధాని నిర్ణయం ప్రకటన చేయకుండా అడ్డంపడాలని చూశారు, ల్యాండ్ ఫూలింగ్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించారు, రైతులను రెచ్చగొట్టే దుర్మార్గానికి వడిగట్టారు, అయినా ప్రజలు విజ్ఞులు కాబట్టి వారి పన్నాగాలు పనిచేయలేదన్నారు.
రాష్ట్రంలో చేసిన మంచిని అభినందించాలి, మనకు కావలసినవి కేంద్రాన్ని అడిగి తెచ్చుకోవాలి అంటూ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి చేపట్టిన చర్యలను వివరించారు. 15 నెలల్లో రూ.8500 కోట్లు నీటిపారుదల ప్రాజెక్టులపై ఖర్చు చేశామన్నారు. 11 విధ్యాసంస్థలను ప్రారంభించామని, 7 సంస్థలను అదనంగా మంజూరు చేయించామని తెలిపారు. కేంద్రం నుంచి ఇప్పటికే రూ.4300 కోట్లు తెచ్చామన్నారు. 13వ ఆర్ధిక సంఘం నిధులను కూడా తెచ్చిన విషయం కూడా గుర్తుచేశారు. 20 రోజులలో 50000 ఎకరాల అటవీ భూమి డీ నోటిఫై చేసేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ప్రధాని అమెరికా నుంచి రాగానే విభజన చట్టంలోని మిగిలిన అంశాలను కూడా అమలు చేసేలా చూస్తామన్నారు.
రూ.24000 కోట్ల రుణ ఉపశమనం రైతులకు కల్గించామని, గతంలో ఎరువులు అడిగితే లాఠీ చార్జీలు, పవర్ హాలీడేలు ఉండేవని ప్రస్తుతం అవి మచ్చుకు కూడా లేవన్నారు. స్తోమతకు మించి పెట్టుబడులు పెట్టవద్దని, శక్తిని మించి కవులుకు తీసుకోవద్దని, అప్పుల పాలు కావద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. సమస్యలను దైర్యంగా ఎదుర్కోవాలంటూ, వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు అనేక చర్యలు చేపట్టిన విషయం గుర్తు చేశారు. మన రాష్ట్రంలో నదుల అనుసంధానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అన్నారు. కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం దేశానికి మనం అందించిన కానుకగా పెర్కోన్నారు. కృష్ణా-పెన్నా అనుసంధానానికి డీపిఆర్ తయారు చేయమని చెప్పామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరిలోనూ అధైర్యం అనేది మచ్చుకు కూడా కనిపించ రాదన్నారు. నదుల అనుసంధానం, మొదటి క్వార్టర్ లో 9.72% వృద్ధి, ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే 2వ ర్యాంక్ సాధించడం మన విజయాలుగా పేర్కోన్నారు.
ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపోందించినందుకు సింగపూర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. మాస్టర్ డెవెలపర్ ఎంపికలో స్విస్ ఛాలెంజిలో భాగస్వాములు కావాలని కోరినట్లు చెప్పారు. అమరావతి డెవలెప్ మెంట్ కార్పోరెషన్, సీఆర్ డీఎ, మేనేజ్‌మెంట్ కన్సల్‌టెంట్ ల ద్వారా పకడ్బందీగా రాజధాని నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిర్థిష్ట కాల వ్వవదిలో అమరావతిని మెగా సిటిగా అభివృద్ధి చేస్తామన్నారు. శంకుస్థాపనకు ఇంకా 25 రోజులే ఉందంటూ రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరు అనుసంధానం కావాలన్నారు.