తెలంగాణ తీరంలో

telangana bandఒకడు ఒకందుకు తాగబోస్తే, మరొకడు మరెందుకో తాగాడన్నది సామెత. అచ్చంగా అలాగే వుంది. ఇప్పుడు తెరాసలో జరగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెరాస అన్నది మిగిలిన రాజకీయపక్షాలకు కాస్త భిన్నమైనది. అది కేవలం అధికారం అందుకోవడానికి కాకుండా, ఒక లక్ష్య సాధన కోసం పుట్టిన పార్టీ. అందువల్లనే ఆ ప్రాంత ప్రజల్లో ఆ పార్టీకి ఆ పాటి ఆదరణ లభించింది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే రాను రాను ఆ పార్టీ, తన లక్ష్య సాధనపై కన్నా పార్టీ ఉనికి నిలబెట్టుకునేందుకు, అధికారం సాధించేందుకు ప్రయత్నించడం ఎక్కువయింది. ఒక ఫక్తు రాజకీయ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో అలాగే వ్యవహరించడం ఎక్కువయింది.

అదే సమయంలో ఉద్యమం వేరు, అధికార సాధన వేరు కనుక, పార్టీ కనుసన్నలలో వుండేలా ఉద్యమ నిర్వహణ బాధ్యతలు మోయడానికి వీలుగా, జెఎసి అంటూ ఒకదాన్ని ఏ ర్పాటు చేసారు. ఒక విధంగా ఇది సరియైన నిర్ణయమే. ఎందుకుంటే, అప్పుడు తెరాస రాజకీయ పార్టీగా మిగిలిపోతుంది. ఉద్యమ పంథా వీడిందన్న అపప్రథ మోయనక్కరలేదు. తాను కూడా అన్ని రాజకీయాపార్టీల తానులోని ముక్కనేనని చెప్పుకోవచ్చు. 

అయితే జెఎసి ఏర్పాటయిన తరువాత దానికి నేతృత్వం వహించిన కోందండరామ్ కు రెండు సమస్యలు ఎదురయ్యాయి. ఒకటి జెఎసిని వివిధ పార్టల, సంఘాల, ఉద్యమనతల మనోభీష్టాలకు అనుగుణంగా, సమన్వయం చేసుకుంటూ నడపాల్సి రావడం. రెండవది, దాని సారథిగా తన ఉనికి కాపాడుకోవడం. కానీ అక్కడే సమస్య వచ్చింది. ఒకటి వివిధ పార్టలను, నాయకులను ఒకతాటిపైకి తేవాలంటే, కేసిఆర్ మాట కాస్త పక్కన పెట్టాలి. కానీ కేసిఆర్ మాట పక్కన పెడితే, తన ఉనికికే ఫ్రమాదం. అందుకే ఇప్పుడు జెఎసి ఎకంగా పోరుబాటను తాత్కాలికంగా పక్కన పెట్టేసింది. కారణం ఒక్కటే ఇప్పుడు ఎంత పోరాడినా ఎన్నికల ముందు తెలంగాణా వచ్చే ముచ్చట కనిపించడం లేదు. ఆ సంగతి తెలిసి కూడా ఉద్యమం కోసం తాను నానా హడావుడి పడి, తానేదో పెరిగిపోతున్నట్లు కెసిఆర్ కు సంకేతాలిచ్చి, ఆయన ఆగ్రహానికి గురికావడం ఎందుకున్నది ఆయన ఆలోచన అయి వుండొచ్చు.

ఇక జెఎసి వైఖరి ఇలా వుంటే, ఉద్యమం ఎప్పుడైతే ప్రస్తుతానికి చల్లారనిచ్చి, రాజకీ య ప్రయోజనాలు సాధించాల్సిన సమయం వచ్చిందో కెసిఆర్ తన ముసుగు తీసేసారు. ఫక్తు రాజకీయ పార్టీ నేతగా మారిపోయారు. తెరాసను రాజకీయంగా బలోపేతం చేయాల్సిన అగత్యాన్ని గుర్తించారు. ఎందుకంటే, తెరాస ఊపు ఎంత వున్నా బలం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే పట్టుమని ఇద్దరు లోక్ సభ సభ్యలు, 17మంది శాసన సభ్యలు ఆ పార్టీ బలం. పైగా ఎన్ని రాజీనామాలో.. మరెన్ని ఎన్నికలో. అయినా బలం ఇంతే. తెలంగాణా మొత్తం ఉద్యమ స్ఫూర్తితో ఊగిపోతోంది అన్నది వాస్తవం అనుకుందాం. తెరాస దాన్ని ఓట్లుగా మార్చుకునే శక్తి వున్న ఏకైక రాజకీయ పార్టీ అనుకుంందాం. మరి అటువంటప్పుడు 2004లో అయిదు/ఇరవై అయిదుగా వున్న బలం ఇప్పుడు ఎందుకింత తగ్గింది? వాస్తవానికి తెలంగాణా ప్రాంతంలో వున్నది 119 శాసనసభ్యలు, 17మంది లోక్ సభ సభ్యలు. మరి అద్భుతంగా వున్న ఉద్యమ వేడిని ఓట్లుగా మార్చుకోవడంలో తెరాస విఫలమైనట్లేగా? ఒకసారి కాంగ్రెస్ తో, మరోసారి తెలుగుదేశంలో పొత్తు పెట్టుకుందంటే, తన స్వంత బలంపై నమ్మకం లేనట్లేగా?

ఈ సంగతి తెరాస అధినేత చంద్రశేఖర రావుకు కూడా తెలియనిది కాదు. అంతే కాదు. ఈసారి ఎన్నికల్లో శాసనసభ్యలు సంగతి సరే, లోక్ సభ సభ్యుల సంఖ్య పెంచుకోకుంటే, తెరాసతో సహా తన రాజకీయ భవిష్యత్ గతుకుల బాటలో పడుతుందని ఆయన గ్రహించారు. అందుకే ఇప్పుడు ఇతరపార్టీల్లోని గెలుపు గుర్రాలపై దృష్టి సారించారు. అన్ని పార్టీల నాయకులకు ఓపెన్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ఆలసించిన ఆశాభంగం అంటూ ప్రకటనలు గుప్పించారు. కెసిఆర్ ఇలా పిలుపు నివ్వడం అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి తన పార్టీలు గెలవగల దమ్మున్న నేతలు లేరని అంగీకరించినట్లు. రెండవది ఇన్నాళ్లూ ఏ కాంగ్రెస్ నేతలనైతే, తాను నోటికి వచ్చనట్లు తిట్టిపోసారో, వారు రాకుంటే తెలంగాణా సాధన అసాధ్యం అని. ఇది సహజంగానే ఇప్పటికే పార్టీలో వున్న క్యాడార్ ను నిరాశకు గురిచేస్తుంది. అయితే ఇక్కడ ఇన్నాళ్లూ తెరాస తప్ప ప్రత్యామ్నాయం లేదు కనుక, వారు సైలెంట్ గా వున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మళ్లీ మిగిలన పార్టీల బలంపై ఆశలు చిగురిస్తున్నాయి. అందుకే వలసలు ఇట్నుంచే కాక అట్నుంచీ మొదలయ్యాయి.

ఇక కాంగ్రెస్ నేతలు ఎందుకు పార్టీ మారుతున్నారంటే? గెలుపుపై భయం. ఇప్పుడు ఎంత చల్లారినా మళ్లీ ఎన్నికల నాటికి ఏదో ఒకటి చేసి కెసిఆర్ తెలంగాణా ఉద్యమాన్ని ఎగసం దోస్తారని, అప్పుడు గెలుపు కష్టమవుతుందన్న భయం. దీన్ని మించిన భయం ఇంకొటుంది. గత అయిదేళ్లుగా అడపాదడపా, తెరాస దాడిని తట్టుకోవడానికి కాంగ్రెస్ లో వుంటూ కూడా అధిష్టానానికి ఇష్టం వచ్చినట్లు అల్టమేటమ్ లు, ధర్నాలు, హడావుడి చేసారు. ఇప్పుుడు ఎన్నికల వేళ బంతి సోనియా కోర్టులొ వుంది. ఇలా చెలరేగే వారికి టికెట్ ఇవ్వడమా మానడమా అన్నది ఆమెకు బాగా తెలుసు. టికెట్ రాదు అన్న భయం వున్న వారే పార్టీ వదుల్తున్న సంగతి ఇక్కడ గమనించాలి.

ఇలా గెలుపు గుర్రాల కోసం కెసిఆర్, అటు టికెట్ కోసం కాంగ్రెస్ ఎంపీలు భుజుం భుజం కలుపుతుంటే, ఉద్యమ ప్లకార్డలు మూలన పడేసి, కోదండరామ్ చేష్టలుడిగి చూడడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. కానీ తెరాస తీరు, ఇతర పార్టీలకు బలాన్నిస్తుందని గమనిస్తుందన్న తెలంగాణా వాదులు మాత్రం ఉద్యమం పక్కదారి పట్టిన వైనం చూసి లోలోపల బాధ పడుతున్నారు.