పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేయటానికి మలేషియా సిద్ధంగా ఉందని మలేషియా రవాణా శాఖ మంత్రి లీవె షంగ్ లై (Liow Tiong Lai) స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ఆయన తన ప్రతినిధి బృందంతో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఓడరేవులు, ఎయిర్ పోర్టులు, పట్టణాభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీలో రవాణా రంగ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను, విశేషాలను వివరించారు. తమ రాష్ట్రం తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉందని, దాదాపు 975 కిలోమీటర్ల సముద్ర తీరం వుందని, తీరం వెంబడి పర్యాటక రంగాభివృద్ధికి పుష్కల అవకాశాలున్నాయని తెలియజేశారు. మలేషియాలోని నార్త్ సౌత్ రోడ్డును స్ఫూర్తిగా తీసుకుని తమ దేశంలో వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న కాలంలో ‘స్వర్ణ చతుర్భుజి’ రహదారులకు రూపకల్పన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.
బౌద్ధ టూరిజానికి కేంద్రంగా ఏపీ: సీఎం
బౌద్ధ టూరిజానికి ఏపీ ఒక కేంద్రంగా రూపొందుతుందని, ఒకనాడు బౌద్ధం విలసిల్లిన నేలపై ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ఆయన మలేషియా ప్రతినిధి బృందానికి వివరించారు. మలేషియా ప్రభుత్వం పరిపాలనలో అనుసరించే పారదర్శక విధానాలు తనకెంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాల కోసం పరిపాలనలో తాము మలేషియా తరహా ‘పెమాండు’ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. మలేషియా మంత్రి లీవె షంగ్ లై స్పందిస్తూ పరిపాలనా సంస్కరణలలో సహకారం అందించటానికి ఏపీతో ఇప్పటికే అంగీకారం కుదిరిందన్నారు. మలేషియా ప్రతినిధి బృందంలో ఆ దేశ రవాణా శాఖ జనరల్ సెక్రెటరీ సరిదుద్దీన్ ఖాసిం తదితరులున్నారు.