ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా విడిపోయిన విషయం తెల్సిందే. హైదరాబాద్ పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి పాలన వద్దనే ఉద్దేశ్యంతో అమరావతి అంటూ రాజధాని నిర్మాణం మొదలు పెట్టాడు. ఇప్పటికే అక్కడ తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేసి అక్కడ నుండి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధానిని తరలించే విషయమై ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న కారణంగా అమరావతికి ఎక్కువగా వరదలు వచ్చే అవకాశం ఉందని, చిన్న పాటి వర్షాల కారణంగా భవిష్యత్తులో పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటూ మొదటి నుండి కూడా వైకాపా అమరావతిని వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్ మెల్ల మెల్లగా రాజధాని మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కేంద్రంతో చర్చలు జరిపి రాజధాని ప్రాంతంను అమరావతి నుండి ప్రకాశం జిల్లా దొనకొండకు మార్చాలని నిర్ణయించారంటూ వార్తలు వచ్చాయి. దొనకొండ రాజధాని అంటూ ప్రచారం మొదలైన వెంటనే అక్కడి భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి. ఓవర్ నైట్‌లో వందల కోట్ల రూపాయలు భూముల రేట్లు పెరిగాయి. మరో వైపు తిరుపతి కూడా రాజధాని చేయాలనే డిమాండ్ వస్తుంది. మరి రాజధాని ఏదీ అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మార్పు అయితే కన్ఫర్మ్ అన్నట్లుగా అనిపిస్తుంది.