ప్రారంభమైన బీఏసీ మీటింగ్…సభలో రెండు కీలక బిల్లులు…!

 

రేపు ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం అసెంబ్లీలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి కన్నబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సంఖ్య పరిమితిని బట్టి టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యేకే చాన్స్ ఉండటంతో అచ్చెన్నాయుడు సమావేశానికి వచ్చారు.

 

రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయంపై చర్చ జరుగోతోంది. అసెంబ్లీ సమావేశాల షార్ట్ డిస్కషన్ లో కరువుపై చర్చించాలని టీడీపీ కోరనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రెండు కీలక బిల్లులు సభలో ప్రవేశ పెట్టనున్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఇక మంత్రివర్గంలో 60 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ వర్గాలకు నామినేషన్‌ పదవులు, ఐదు లక్షల రూపాయలలోపు నామినేషన్‌ పనుల్లో 50 శాతం కల్పిస్తూ చట్టబద్ధత కల్పించనుంది.