ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ వర్కర్లకు పదోన్నతులు, పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. అలాగే ‘థాంక్యూ ముఖ్యమంత్రి గారు’ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రాష్ట్రంలోని అంగన్ వాడీ సూపర్‌వైజర్లు, వర్కర్ల చేతికి ప్రభుత్వం కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవ్వనుంది. రాష్ట్రంలోని 55,607 అంగన్ వాడీ వర్కర్లు, 1,377 వర్కింగ్ సూపర్‌వైజర్లకు కలిపి మొత్తం 56,984 స్మార్ట్‌ఫోన్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.