అంతర్వేది లో ఉద్రక్త వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 5 అర్ధరాత్రి తర్వాత అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం మంటల్లో కాలిపోయిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలంగా ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఈ రథాన్ని వినియోగించేవారు. అంతర్వేది రథోత్సవం అత్యంత ఉత్సాహంగా సాగేది. భక్తులు పవిత్రంగా భావించే ఈ రథం మంటల్లో కాలిపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై ఇప్పటికే పలు హిందూ సంస్థలు ఆందోళనలు చేపట్టగా..బుధువారం అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేశారు.
బుధవారం ‘చలో అంతర్వేది’కి బీజేపీ, జనసేన సహా వివిధ ధార్మిక, మత సంస్థలు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొందరు నేతలను గృహ నిర్బంధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూపరిషత్, బీజేపీ, జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు కార్యకర్తలను సైతం బైండోవర్ చేస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అంతర్వేది చుట్టు పక్క ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత పెంచారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు.