డోలుపోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్లుగా…!

నేడు దేశరాజధానిలో జరిగిన సంఘటన అచ్చు ఇలాగే ఉంది. కేంద్ర ప్రభుత్వంలో తనకు ఎలాంటి గౌరవం లేదని, ప్రధాని అవ్వాల్సిన తనను కనీసం ఒక సీనియర్‌ నేతగా కూడా గుర్తించడం లేదని గత కొంత కాలంగా కుమిలి పోతున్న బీజేపీ అగ్రనాయకుడు ఎల్‌కే అద్వానీ వద్దకు నేడు తెలుగు దేశం ఎంపీలు వెళ్లి తమకు జరుగుతున్న అన్యాయం గురించి ఏకరువు పెట్టుకున్నారు. కొత్త రాష్ట్రం ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, మీరైనా మాకు న్యాయం చేయించండి అంటూ అద్వానీని కోరడం జరిగింది. అయితే ఎంపీల మాట మేరకు అద్వానీ స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో మాట్లాడటం జరిగింది.

అరుణ్‌ జైట్లీ మాత్రం ఇప్పటికే ఏపీకి ఎంతైతే ఇవ్వాలో అంత ఇచ్చేశాం. ఆ తర్వాత మోడీ ఇష్టం అంటే అద్వానీ వద్ద తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. అరుణ్‌ జైట్లీకి కాని, అద్వానీకి కాని మోడీ వద్ద ఈ విషయాన్ని చర్చించేంత అవకాశం, చొరవ లేదు. అందు వల్ల ఎంపీలు వెళ్లి అద్వాని వద్ద పెట్టుకున్న మొర ఆ సామెతను గుర్తుకు తెస్తుందని కొందరు రాజకీయ పండితులు అంటున్నారు. సీనియర్‌ నాయకులనే కాదు, తన క్యాబినెట్‌ మంత్రులను కూడా నోరు తెరవకుండా చేయడంలో మోడీ తనదైన ముద్రను పరిపాలనలో వేశాడు.