Site icon TeluguMirchi.com

ఎప్పటికైనా నేనే మంత్రి – రోజా

జగన్ కాబినెట్ లో మంత్రి పదవి రాకపోవడం తో నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తికి లోనయ్యింది. జగన్ కాబినెట్ ప్రకటించాక ముందు వరకు కూడా అందరూ రాజా కు మంత్రి పదవి రావడం ఖాయమని అనుకున్నారు. కానీ రోజా కు ఆ పదవి రాకపోయేసరికి నిరాశ వ్యక్తం చేసారు. రోజా సైతం జగన్ ఫై అలకపాన్పు ఎక్కింది. ఆ తర్వాత జగన్ తో సమావేశం కావాలని రోజా కు విజయసాయి కాల్ చేయడం తో వెంటనే ఆమె హైదరాబాద్ నుండి విజయవాడ కు వచ్చి జగన్ ను కలిసింది.

జగన్ తో భేటీ అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశానన్నారు. తొమ్మిదేళ్లుగా జగన్‌ గారిని ముఖ్యమంత్రిని చేయాలని.. ఈ రాష్ట్రానికి రాజన్న పాలన తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేశామన్నారు. ఆ ఆలోచన తప్ప పదవుల కోసం పని చేయలేదని అందరికి తెలుసన్నారు.

మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తి లేదన్నారు రోజా. అలగడం, బుజ్జగింపులు ఏమీ ఉండవు.. అనవసరంగా మీడియా తప్పుడు సమాచారం ఇవ్వొద్దు.. దూరాన్ని పెంచడం సరికాదన్నారు. ఎంతోమంది అభిమానులు ఆ వార్తలు చూసి ఆవేదనతో ఫోన్లు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయితే మేమంతా ముఖ్యమంత్రులు అయినట్లే.. జగన్ పరిపాలనలో మా నియోజకవర్గాల్లో.. మా ప్రజలకు నవరత్నాలు అందించడానికి.. వారి కష్టాలను దూరం చేయాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచన మాకు లేదన్నారు.

మేము కోరుకున్నట్లు, మేమందరం ఎదురు చూసిన.. ముఖ్యమంత్రి పదవిలో జగన్ మోహన్ రెడ్డిగారు కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నగరి ఎమ్మెల్యే. 9ఏళ్ల తమ కల నెరవేరింది.. సీఎంగా వైఎస్ జగన్ ఈ రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తున్నారన్నారు. మంచి పాలన అందిస్తూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మైమరిపిస్తుంటే.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, వైసీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు రోజా. ఇక చివరిలో ఎప్పటికైనా మంత్రి నేనే అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

Exit mobile version