టీటీడీ చైర్మన్ పదవి ఫై మోహన్ బాబు క్లారిటీ

టీటీడీ చైర్మన్ కు సంబందించిన ఓ వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. జగన్ కుటుంబానికి బంధువు అయిన సినీనటుడు మోహన్ బాబు టీటీడీ చైర్మన్ ఫై మక్కువ తో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికలకు ముందు మోహన్ బాబు స్వయంగా వైసీపీలో చేరడమే కాకుండా, టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలాగే ఆయన కుమారుడు మంచు విష్ణు సైతం వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. దీంతో పాటు మోహన్ బాబు స్వయంగా తిరుపతి వాస్తవ్యుడు కావడంతో పాటు, ఆయనకు అక్కడ పలు విద్యాసంస్థలు ఉన్నాయి. అలాగే గతంలో రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన అనుభవం కూడా ఉంది. దీంతో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే అనుకోవడం మొదలు పెట్టారు.

ఈ వార్తల ఫై మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా మనము ఏదైనా మద్దతు చేస్తే పార్టీ తిరిగి మనకు ఏమైనా చేయాలనే పాలసీ తో రాజకీయాలు నడుస్తాయి. ఐతే దీనికి నేను భిన్నం అంటున్నారు మోహన్ బాబు. టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నవారి లిస్టులో నేను ఉన్నానని వస్తున్న పుకార్లలో నిజం లేదన్నారు. నేను జగన్ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో నావంతు ప్రయత్నం నేను చేశాను అన్నారు. జగన్ ప్రజల సీఎం గా ప్రజాపాలన చేస్తారనే నమ్మకంతో ఆయనకు మద్దతుగా రాజకీయాలలోకి తిరిగి వచ్చానే కానీ ఎటువంటి పదవుల కోసం కాదని అన్నారు. అలాగే ఇలాంటి పుకార్లను దయచేసి రాయవద్దని మీడియాను ట్విట్టర్ వేదికగా అభ్యర్ధించారు.