Site icon TeluguMirchi.com

ఇక రాష్ట్రపతి పాలనేనా?

Pranab-Mukherjeeరాష్ట్రంలో విభజన రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం మంత్రి విశ్వరూప్ తన మంత్రి పదవికి రాజీనామా చేయగా..తాజాగా సీఎం కిరణ్ తాను సమైక్యవాదినంటూ విభజనకు వ్యతిరేకంగా అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ప్రజల కంటే తనకు పదవి ముఖ్యం కాదని, అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. ఇక పీసీసీ చీఫ్ బొత్స కూడా తన జోడు పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సీమాంధ్రకు చెందిన ఎంపీలు, మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం చర్చలు కూడా జరుపుతున్నారు.

ఒకవేళ వీరంతా రాజీనామాలు చేసి ఆమోదించుకుంటే రాష్ట్రంలో పాలన గాడి తప్పడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితే కాదు ప్రభుత్వం కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే రాష్ట్రం రాష్ట్రపతిపాలనలో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణరాష్ట్ర ఏర్పాటుపై ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు స్పష్టం చేసిన నేపథ్యంలో సీఎం, బొత్సతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలకు రాజీనామా తప్ప వేరే మార్గం కనిపించడంలేదు. వారు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామాపై వెనక్కి తగ్గకూడదని గట్టి పట్టుమీదున్నారు.

రాజీనామాస్త్రాలతో అధిష్టానంపై రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఒత్తిడి తీసుకురావాలన్న ప్లాన్ లో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులున్నారు. ఒకవేళ అధిష్టానం వీరి రాజీనామాలకు తలొగ్గకుండా విభజనపై వెనక్కి తగ్గకపోతేమాత్రం రాష్ట్రపతి పాలన దిశగా రాష్ట్రంలో పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మరి ప్రభుత్వం వీరి రాజీనామాలు ఆమోదిస్తుందా?తెలంగాణపై వెనక్కు తగ్గుతుందా?లేక రాష్ట్రపతిపాలనలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొగ్గు చూపుతుందా? వేచి చూడాల్సిందే…

Exit mobile version