ఏపీ బడ్జెట్ 2018: ఆకర్షణీయంగా బడ్జెట్


ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ 2018-19 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 11.30గంటలకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ మొత్తం రూ.1,96,800కోట్లుగా ఉండనుంది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,63,660 కోట్లు కాగా, కేపిటల్‌ వ్యయం కింద రూ.33,160 కోట్లు ప్రతిపాదించనున్నారు.

బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేయనుంది. సమాజంలో అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరిచేలా కొత్త పథకాలతో.. భారీ కేటాయింపులతో సిద్ధం చేసినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో కొత్త పథకాలతో బడ్జెట్‌ను ఆకర్షణీయంగా తయారుచేసినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి ఏడాది బడ్జెట్‌ను 20 శాతం మేర పెంచుతుంటారు. ఆ విధంగా చూస్తే కొత్త బడ్జెట్‌ రూ.1.86 లక్షల కోట్ల వరకు ఉండవచ్చు. ఎన్నికల నేపథ్యంలో మరో రూ.10 వేల కోట్లు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది