కేంద్రం మోసం చేసిందా.. ?

anamta venkatarami reddyరాష్ట్ర విభజన విషయంలో.. కేంద్రం తమను మోసం చేసిందని సీమాంధ్ర నేతలు వాపోతున్నారు. గత అరవై రోజులకు పైగా.. సీమాంధ్రలో కనివిని ఎరుగని రీతిలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. టీ-నోట్ ని కేబినేట్ ముందుకు తీసుకురావడం దుర్మార్గమైన చర్యగా ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. అనంత ఈరోజు ఉదయం విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు అధిష్టాన పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పుడు.. వారు తెలంగాణ నోట్ రాకుండా చూస్తామని హామి ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడేమో.. ప్రజాభిష్టాన్ని గుర్తించకుండా కేవలం రాజకీయ లబ్ది కోసమే విభజన విషయంలో ముందుకు వెళ్లడం చాలా హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అనంతతో పాటుగా మిగితా ఎంపీలు, మంత్రులు కూడా అధిష్టానం మోసం చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. నిన్నటి వరకు టీ-నోట్ ఇంకా రెడీ కాలేదని చెబుతూనే.. రాత్రికి రాత్రే బిల్లు రెడీ అని చెప్పడం పట్ల సీమాంధ్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజనను ఆపేందుకు ఎలాంటి త్యాగాలకైనా.. సిద్దమని సీమాంధ్ర నేతలు స్పష్టం చేస్తున్నారు.