జయప్రదకు ” అమ్మ ” హస్తం !

jayaprada-in-ap-politicsసినీ నటి , పార్లమెంటు సభ్యురాలు జయప్రద కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి నుంచి అభయహస్తం లభించినట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఆ పార్టీలో చేరతా…. ఈ పార్టీలో చేరతా అంటూ నానా బెదిరింపులు చేసిన జయప్రద ప్రస్తుతానికి కాంగ్రెస్ బస్ స్టాప్ దగ్గర ఆగినట్టు కనపడుతోంది. ” త్వరలో రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తా ” అంటూ గత సంవత్సర కాలంగా ప్రకటిస్తూ, ఏ పార్టీలో చేరేది అనే విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ నెట్టుకొస్తున్న ఈ అభినేత్రికి ఎట్టకేలకు ఒక ఆదరువు లభించింది. తానెంతగా ప్రయత్నించినప్పటికీ ఇటు తెలుగుదేశం గానీ, అటు జగన్ పార్టీ గానీ ఆమెను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ముందుకు రాకపోవటంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరికి కొద్ది రోజులక్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి ని కలిసిన జయప్రద తన మనసులోని మాటను ఆమెకు చెప్పారట. సోనియాగాంధి కూడా ఈమెను కాంగ్రెస్ లోకి సాదరంగా స్వాగతించారని సమాచారం. పనిలో పనిగా తాను రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తానంటూ  జయప్రద ఆమెతో చెప్పేశారని, ఆ మేరకు సోనియా గాంధీ కూడా జయప్రదకు హామీ ఇచ్చారని, అక్కడి సిట్టింగ్ ఎం.పి. ఉండవిల్లి అరుణ్ కుమార్ ను రాజ్యసభకు పంపేందుకు మేడం డిసైడ్ అయ్యారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఈ భోగట్టా కు బలాన్ని చేకూరుస్తూ నిన్న జరిగిన యు.పి. ఎ. నాలుగేళ్ల విందు సమావేశానికి జయప్రద, అమరసింగ్ లు హాజరయ్యారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాజమండ్రి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మురళీమోహన్, కాంగ్రెస్ తరపున జయప్రద జగన్ పార్టీ తరపున బొమ్మన రాజకుమార్ గానీ లేదా మరొకరి మధ్యన రసవత్తర పోటీ జరిగే అవకాశాలు వున్నాయి. ఈ సారి ఉండవిల్లి తో పోటీకి రంగంలో దిగితే విజయం తనకు నల్లేరు మీద బండి అనుకుంటున్న మురళీ మోహన్ కొంచెం గట్టి పోటినే ఎదుర్కోవలసి రావచ్చేమో. వ్యక్తిగా మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ గ్రూపులను ప్రోత్సహించే మురళి మోహన్ వైఖరి ఈ సారి ఆయనకు కొద్దిపాటి ఇబ్బందిగా పరిణమించ వచ్చనేది రాజకీయ విశ్లేషకుల భావన.