అమరావతి నగర ఆవిర్భావం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులతో అనుసంధానం చేసేదిగా వుండాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన రాజధాని సలహా కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి అక్టోబర్ 22న నిర్వహించనున్న ’రాజధాని భూమి పూజ’ ఏర్పాట్లపై సమీక్షించారు. భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్రమోడీ అంగీకరించారని చంద్రబాబు తెలిపారు. ‘ఎక్కడ భూమి పూజ నిర్వహించనున్నామో అక్కడ ఏమాత్రం వాస్తు దోషం రాకూడదు. ఆ ప్రాంతాన్ని ఒక ఆకర్షణీయంగా, మనోహరంగా తీర్చిదిద్దాలి. భూమిపూజ చేసిన ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా రూపొందించాలి. నదుల అనుసంధానం కార్యక్రమం లానే అన్ని మండల కేంద్రాల నుంచి మట్టి తీసుకొచ్చి అమరావతి నగర నేలలో మిళితం చేయాలి’ అని ముఖ్యమంత్రి వివరించారు.
సీడ్ క్యాపిటల్ కు గుర్తించిన మూడు యూనిట్లలో నదీ ముఖద్వార ప్రదేశం వుండటంతో సీడ్ క్యాపిటల్ చర్చకు వచ్చిందన్నారు.భూమిపూజ ప్రాంతాన్ని ఒక ప్రజాకర్షణీయ స్థలంగా తీర్చిదిద్దాలని కోరారు. అమరావతి పూర్వం ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంటుంది?భవిష్యత్తులో ఎలా వుండబోతోందో వివరించేదిగా ఈ సందర్శనా స్థలం వుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ‘ప్రజారాజధానిగా అమరావతి నగర ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్ ప్రజల మానసిక అనుబంధం పెనవేసేదిగా వుండాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. అద్భుతంగా ఆకర్షణీయంగా, మనకు గర్వకారణంగా భాసించాలి. రాజధాని నిర్మాణంలో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలూ తప్పక భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మండలాల పరిధిలోని సర్పంచులంతా తమ తమ ప్రాంతాల నుంచి నేలతల్లి నుంచి సేకరించిన మట్టిని తీసుకొచ్చి రాజధాని భూమిలో కలపాలని కోరారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు అమరావతితో ఒక మానసిక అనుబంధం ఏర్పడుతుందన్నారు. పూజ చేసిన తర్వాత మట్టిని సేకరించి పూర్ణ కుంభాలతో రాజధానికి తేవాలని వివరించారు. ఈ పూర్ణకుంభాలన్నింటినీ ఒక్కచోట చేర్చి భారీ శిల్పంగానో, ఒక స్మృతి చిహ్నాంగానో తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజారాజధానిలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రముఖంగా ప్రతిబింబిస్తూ, బుద్ధిజానికి అనుసంధానమైనటట్లుగా బోధి వృక్షం కిందికి ఈ కలశాలను తీసుకువస్తే ఎలా వుటుందని ప్రశ్నించారు.
ఈ అంశంపై అందరూ నూతన ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. రాజధానికి భూమిపూజ అంటే ఏదో అక్టోబర్ 22 విజయదశమితో మాత్రమే ముడిపడిన ఘటనగా భావించవద్దని ముఖ్యమంత్రి కోరారు. వీజీటీఎం ఏరియాలో వెనువెంటనే సుందరీకరణ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రమంతా ఏకరూపత వుట్టిపడాలని, భూమిపూజ మహోత్సవాన్ని దసర నవరాత్రి ఉత్సవాలను భూమిపూజ వేడుకలతో కలిపి నిర్వహిస్తే బాగుంటుందని, తద్వారా భూమిపూజ వేడుకలకు సాంస్కృతిక సొబగులు అద్దినట్లు వుంటుందని, దసరా నవరాత్రులను భూమిపూజ ఉత్సవంతో కలిపి పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చంద్రబాబు కోరారు. అమరావతి ప్రాంగణంలో రాజధానికి భూములిచ్చిన రైతుల పేర్లను అమరద్వారం పేరుతో నిర్వహించే ఎగ్జిబిషన్ లో రాసి ప్రదర్శిస్తామన్నారు. వేయిమంది వీఐపీలు, 50 వేల మంది ప్రజలు కూర్చునేలా వేడుక జరిగే ప్రాంగణాన్ని రూపొందిస్తామని సీఎం అన్నారు. వేడుకల నిర్వహణలో అనుభవంవున్న మంచి సంస్థకు ఈ ప్రతిష్ఠాత్మక వేడు నిర్వహణ కార్యక్రమాన్ని అప్పగిస్తామన్నారు. వేడుకలను ఎలా నిర్వహించాలి, ఎలా చేస్తే బాగుంటుందన్న అంశంపై ఎంపీ గల్లా జయదేవ్, పారిశ్రామికవేత్త జీవీకే సంజయ్ రెడ్డి,జీఎంఆర్ గ్రూపు పక్షాన శ్రీనివాస్, శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, నూజివీడు సీడ్స్ అధినేత మండవ ప్రభాకర్ తదితరులు విడియో కాన్ఫరెన్ ద్వారా తమ సూచనలు,అభిప్రాయాలను తెలియజేశారు.
తన సాస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ అమరావతిని యావత్ భారతదేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని గల్లా జయదేవ్ అన్నారు. రాజధాని భూమిపూజ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మధురానుభూతిగా నిలిచిపోవాలని,ఆరోజు అంతా ఏకరూప దుస్తులు (యూనిఫారం) ధరిస్తే దేశానికే మనరాజధాని ప్రత్యేకతను చాటిచెప్పినట్లు వుంటుందని పారిశ్రామికవేత్త సంజయ్‌రెడ్డి అన్నారు. సమావేశంలో మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఏకే పరీడా (అటవీశాఖ), ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ జైన్, సిఆర్డీఏ కమిషనర్ శ్రీ ఎన్. శ్రీకాంత్, కృష్ణా జిల్లాకలెక్టర్ బాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ కాంతిలాల్ దందే, వివిధ శాఖల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.