బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. కూకట్‌పల్లిలో భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ కిడ్నాప్‌కు హపీజ్‌పేట్‌లోని భూ వ్యవహారమే కారణంగా చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి హయా నుంచి ఈ భూ వివాదం కొనసాగుతోంది.
భూమి అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి సోదరుడు సెటిల్‌మెంట్ చేసేందుకు ప్రయత్నించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు. మొత్తం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిల ప్రియ, ఆమె భర్తపై పోలీసులకు ప్రవీణ్ రావు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేయడం తో ఆ పిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఈ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అఖిల ప్రియ తెలిపారు. తన భర్త కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదని.. భార్గవ్‌కు కిడ్నాప్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు కొంత సమయం ఇస్తే అన్ని విషయాలు మీడియాకు తెలుపుతానన్నారు. ఒక వైపు వాదనలు విని… తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని మీడియాను కోరారు.