Site icon TeluguMirchi.com

అక్బర్ కు బిగుస్తున్న ఉచ్చు

Protest against Akbaruddin hate speech 2హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, హిందూ దేవుళ్ళను అవహేళన చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ శాసనసభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పై సోమవారం నాడు మరో రెండు కేసులు నమోదైనాయి. వరంగల్ జిల్లా జనగాం లో ఆయన పై కేసు నమోదయింది. అలాగే అక్బర్ పై చట్టపరమైన చర్యలు గైకొనాలంటూ విజయవాడలో న్యాయవాదులు ఒక ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. దీంతో అక్బర్ పై కేసు నమోదు చేయాలని విజయవాడ కృష్ణలంక పోలీసులను కోర్టు ఆదేశించింది. అక్బర్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావలసిందేనని డి.జి.పి.దినేష్ రెడ్డి స్పష్టం చేసారు. కాగా అక్బర్ సోమవారం నిజామాబాద్ వస్తున్నాడని తెలిసి బి.జె.పి బంద్ కు పిలుపు ఇచ్చింది. వందలాది మంది బి.జె.పి. కార్యకర్తలు అక్బర్ వైఖరికి నిరసనగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బి.జె.పి శాసనసభ్యుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ అక్బర్ ను అరెస్టు చేసే విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అక్బర్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, అక్బర్ దిష్టిబొమ్మల దహనాల వంటి కార్యక్రమాలను బి.జె.పి తదితరపార్టీలు, హిందూ సంస్థలు నిర్వహిస్తున్నాయి. కాగా తనకు ఆరోగ్యం సరిగాలేదని, తాను నాలుగురోజుల తరువాత మాత్రమే విచారణకు హాజరు కాగలనని అక్బరుద్దీన్ పోలీసులను అర్ధించారు. అయితే అక్బర్ తన ఆరోగ్యం విషయంలో నిజం చెబుతున్నారా లేదా అనే అంశాన్ని నిర్ధారించుకునేందుకు ఆదిలాబాద్ నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వ డాక్టర్ల బృందం ఆయన నివాసానికి బయలుదేరారు. ఇదిలావుండగా తన పై పలుచోట్ల ఒకే అంశంపై కేసులు నమోదు కావటాన్ని ఉటంకిస్తూ, అన్ని కేసులను కొట్టివేయాల్సిందిగా అక్బర్ హైకోర్టులో సోమవారం నాడు క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారం నాటికి వాయిదా వేసింది.

హైదరాబాదులోని లాల్ దర్వాజ లో అక్బరుద్దీన్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి ఫలక్ నుమా పొలిసు స్టేషన్ కు తరలించారు. అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మొజంజాహి మార్కెట్ వద్ద బి.జె.పి కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళనకు దిగారు. పోలీసులు వారిపై లాటీ చార్జి చేసారు. దత్తాత్రేయ తో సహా పలువురు నాయకులను అరెస్టు చేసారు. మెహబూబ్ నగర్ జిల్లాలో కూడా అక్బర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన జరిగింది.

Exit mobile version