అక్బరుద్దీన్‌ అరెస్ట్

Akbaruddin-Owaisi-Arrestఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని గాంధీ హాస్పటల్ లో పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి అదిలాబాద్ జిల్లా నిర్మల్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే గాంధీ హాస్పటల్ వద్ద ఘర్షణలు రేగడంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం హైదరాబాద్ నుండి నిర్మల్ వరకూ దాదాపు 210 కి.మీ మేర దారి పొడవునా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లో హై అలర్ట్ ప్రకటించారు. అలాగే దారి వెంట ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అంతకుముందు ఉదయం నుండి వైద్య పరీక్షల పేరుతో దాదాపుగా 5 గంటల పాటు గాంధీ హాస్పటల్ వద్ద హైడ్రామా నడిచింది. హిందూ మతానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ కు గాంధీ ఆసుపత్రిలో నలుగురు డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. తీవ్ర ఉత్కంఠ వాతావరణం మధ్య అక్బరుద్దీన్ ఆరోగ్య నివేదికను గాంధీ వైద్యులు పోలీసులకు అందజేశారు. నాలుగు రోజుల్లో లొంగిపోతానంటూ పోలీసులతో అక్బరుద్దీన్‌ చెప్పినట్లు సమాచారం. అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. అక్బరుద్దీన్ తొడలో బుల్లెట్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అక్బరుద్దీన్ ఎడమ ముంజేయి ఎముకకు గాయం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కడుపు కింది భాగంలో హెర్నియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. హెర్నియా కారణంగా అక్బరుద్దీన్ ఎక్కువ దూరంలో నడవలేని స్థితిలో ఉన్నారని వైద్యులు పేర్నొన్నారు. అనంతరం ఇంటికి వెళతానని పోలీసులను కోరారు. వైద్య నివేదిక వచ్చేంతవరకు ఆస్పత్రిలో ఉండాలని పోలీసులు సూచించారు.

ఈ నేపధ్యంలో పాతబస్తీలోనూ. గాంధీ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గాంధీ ఆసుపత్రి మెయిన్‌ గేట్లు మూసివేశారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లే రహదారులు బంద్‌ చేశారు. ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. పోలీసుల నిఘా పెంచారు. ఎంఐఎం కార్యకర్తలు గాంధీ ఆస్పత్రి వద్ద ఓ బస్సును ధ్వంసం చేశారు. ముందు జాగ్రత్తగా నగరంలోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా, అక్బరుద్దీన్ ను గాంధీ ఆస్పత్రిలోని విశ్రాంతి గదికి తరలించారు. ఐజీ ఆదేశాల మేరకు  పోలీసులు అక్బరుద్దీన్ ని అరెస్ట్ చేసి నిర్మల్ తరలిస్తున్నారు.