Site icon TeluguMirchi.com

అక్బర్…. నోరు అదుపులో పెట్టుకో !!!

Six cases pending against MIM Akbaruddin , Policeమజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల మతపరంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. అక్బర్ తీరు పట్ల వివిధ రాజకీయ పక్షాలతోబాటు ముస్లిం మతపెద్దలనుంచి కూడా తీవ్ర నిరసనలు, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. అక్బర్ వ్యాఖ్యలపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. వెంటనే ఆయనను అరెస్టు చేయాలని, ఆయనపై కఠిన చర్యలు గైకోనాలని పిటిషన్ దారులు కోర్టును అభ్యర్ధించారు. దాదాపు దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టులు విచారణకు స్వీకరించాయి. కోర్టు ఆదేశాల మేరకు అక్బరుద్దీన్ పై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి కూడా. అక్బరుద్దీన్ అందుబాటులో లేకపోవటంతో వారెంట్లను ఆయన ఇంటి గోడపై పోలీసులు అంటించారు. ఆయన కోసం పోలీసులు తీవ్ర గాలింపు జరుపుతున్నారు. అక్బర్ లండన్ లో వున్నారన్న సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్నట్టు స్వయానా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు దినేష్ రెడ్డి చెప్పారు. అక్బర్ ప్రస్తుతం లండన్ లో వున్నట్టు ద్రువికరించే కొన్ని దృశ్యాలను కొన్ని టీవీ చానెళ్ళు ప్రసారం చేసాయి కూడా.

కాగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు హిందూ మతస్థులను మాత్రమే కాకుండా ముస్లిం మతస్థులను కూడా తీవ్రంగా నొప్పించాయి. ఇండియా లోని ముస్లిములు భారతీయులేనని, అక్బర్ వ్యాఖ్యలు వారి సమగ్రతను దేబ్బతీసేవిగా వున్నాయని, ఒక శాసనసభ్యుడు అయివుండి ఇంతటి బాధ్యతా రహితమైన మాటలు మాట్లాడటం దారుణమని ముస్లిం మతపెద్దలే విమర్శిస్తున్నారు. రోజు రోజుకీ ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి దేశవ్యాప్తం అవుతుండటం ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే ముస్లిములకు అత్యంత సురక్షితమైన, భద్రమైన దేశం భారతదేశం అనీ, అక్బర్ చేసిన వ్యాఖ్యలు భారత దేశంలోని ముస్లిములను ఇరకాటంలో, ఇబ్బందుల్లో పడేసేవిగా వున్నాయని వారు పేర్కొంటున్నారు.

ఇదిలా వుండగా రాష్ట్రవ్యాప్తంగా వున్న హైందవ ధార్మిక సంస్థలు, హిందూ మత సంస్థలు అక్బర్ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాయి. అక్బర్ వి అహంకారపూరిత ప్రేలాపనలని, బాధ్యతాయుతమైన శాసన సభ్యుడై వుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని ఆయా సంస్థలు నిరసన తెలుపుతున్నాయి. అతడిని వెంటనే అరెస్టు చేయాలని, మతవిద్వేషాలను రెచ్చగొట్టినందుకు చట్టప్రకారం కఠిన చర్యలు గైకొనాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. మజ్లిస్ పార్టీ అంటే ముస్లిములు అందరూ కాదని, కొంతమంది ముస్లిములు పెట్టుకున్న పార్టీ మాత్రమేనని, అక్బర్ వ్యాఖ్యలను ముస్లిముల అభిప్రాయంగా పరిగణించకూడదని అంటూ అక్బర్ ను శాసన సభ్యుడిగా అనర్హుడిని చేయాలని ఆ సంస్థలు కోరుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో అక్బరుద్దీన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతుండటంతో ఈ వివాదం అంత తేలికగా సమసిపొయేదిలా లేదనిపిస్తోంది. గతంలో ఏ ముస్లిం నాయకుడూ ఇంతటి దురహంకారపూరిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పవచ్చు. అక్బర్ వ్యాఖ్యలు దేశ అంతర్గత శాంతిభద్రతల సమస్యగా కూడా చూడాల్సిన అవసరం వుంది.

అక్బర్ వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీలు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అక్బర్ ఒక ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు అతడిపై ఎందుకు చర్యలు గైకొనటం లేదో అర్ధం కావటం లేదని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆగ్రహించారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన తమ్ముడి వ్యాఖ్యలను ఎందుకు ఖండించటం లేదని ఆయన ప్రశ్నించారు. అక్బర్ వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అక్బర్ హద్దులు దాటి మాట్లాడారని, మతోన్మాదాన్ని రెచ్చగొడితే సహించేదిలేదని ఆయన అన్నారు. అక్బర్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యుడిలా
మాట్లాడుతున్నారని, అసలు ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తో ఆరా తీయాలని కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి డిమాండ్ చేసారు. అక్బర్ పై తక్షణమే కఠిన చర్యలు గైకొనాలని టిఆరెస్ ఎం ఎల్ ఎ కె.తారకరామారావు ప్రభుత్వాన్ని కోరారు. కాగా అక్బర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర బిజెపి నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏది ఏమైనా అక్బర్ వ్యాఖ్యలు రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రశాంత వాతావరణాన్ని దేబ్బతీసేవిగా వున్నాయనటం నిస్సందేహం. ఇలాంటి ధోరణులను రాజకీయ కోణంలోనించి కాకుండా సామాజిక కోణంలో, శాంతి భద్రతల కోణంలోనించి చూడటం ప్రభుత్వాల బాధ్యత. కలుపు మొక్కల్లాంటి అక్బర్ లాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తక్షణం గైకొనటం ద్వారా ప్రభుత్వాలు తమ ఉనికిని చాటుకోవటం అవసరం. లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు పాలకులే బాధ్యత వహించాల్సివుంటుంది.

Exit mobile version