అన్నాడీఎంకేలో శశికళకు ఇక తావులేదు

జయలలిత మరణం తర్వాత వెంటనే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ తనకు తానుగా చిన్నమ్మగా ప్రకటించుకుంది. అమ్మకు అసలైన వారసురాలిని తానే అంటూ శశికళ ప్రకటించుకున్న విషయం తెల్సిందే. పన్నీర్‌ సెల్వంను బలవంతంగా రాజీనామా చేయించి సీఎం పీఠంపై ఎక్కి కూర్చోవాలనుకుంది. కాని ఆమె అదృష్టం తిరగబడటంతో సీఎం కావాల్సిన శశికళ జైలుకు వెళ్లింది. మళ్లీ వచ్చిన తర్వాత అయినా తానే పార్టీ అధినేత్రిని అంటూ పార్టీ నాయకులతో గట్టిగా చెప్పి వెళ్లింది.

పార్టీలో తన ప్రాభవం ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు తనకు సన్నిహితుడు, బంధువు అయిన టీటీవీ దినకరన్‌కు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించడం జరిగింది. పలనిస్వామిని సీఎంగా చేసి శశికళ జైలుకు వెళ్లింది. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.

పలనిస్వామి, పన్నీర్‌ సెల్వం కలవడంతో పాటు శశికళను పార్టీ నుండి తరిమేయాలని నిర్ణయించారు. శశికళతో పాటు దినకరన్‌ను కూడా పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లుగా నేడు జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. దీంతో సీఎం కావాలని కలలు కన్న శశికళ కనీసం ఎమ్మెల్యే కూడా అయ్యే పరిస్థితి లేదు.