మరో బోఫోర్స్‌ కుంభకోణం బట్టబయలు

italian-chopperదేశంలో జరిగిన భారీ కుంభకోణం మూలాలు ఇటలీలో కదిలిన తర్వాత కానీ మన ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. భారత ప్రభుత్వం వి.వి.ఐ.పీల పర్యటనల నిమిత్తం దాదాపు 3600 కోట్లు వెచ్చించి పది అగస్టా హెలికాప్టర్లు కొనుగోలు చేయడానికి ఇటలీకి చెందిన ఫిన్‌ మెకానికా అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే హఠాత్తుగా ఇటలీలో సదరు సంస్థ ప్రధానాధికారి ఒకర్ని అక్కడి ప్రభుత్వం ఈ ఒప్పందం కోసం భారీ మొత్తంలో లంచం ఇచ్చాడనే నేరంపై అదుపులోకి తీసుకుని గృహనిర్భంధంలో ఉంచడంతో ఈ స్కాం బయటపడింది. హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో దోషులెవర్నీ వదిలిపెట్టమని గురువారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అవరమైతే హెలికాప్టర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏ.కే.ఆంటోని న్యూఢిల్లీలో ప్రకటించారు. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా కేంద్రప్రభుత్వ ఇప్పటికే అందుకున్న హెలికాప్టర్లకు సంబంధించిన చెల్లింపులను కూడా ఈ విషయంలో విచారణ పూర్తయ్యేవరకూ నిలిపి వేస్తున్నట్లు కూడా ప్రకటించింది. హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం మరో బోఫోర్స్ కుంభకోణమని భారతీయ జనతాపార్టీ (బీజేపీ) గురువారం న్యూఢిల్లీలో ఆరోపించింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ కుంభకోణంలో మాజీ ఎయిర్ చీఫ్ త్యాగి ప్రమేయం ఎంత మాత్రం లేదని కేంద్ర మంత్రి పల్లంరాజు స్పష్టం చేశారు.