Site icon TeluguMirchi.com

అద్వానీ జీ…. మీ కిది తగునా ?

advaniచిన్నపిల్లలకు ఉక్రోషం పాలు ఎక్కువగా ఉంటుంది. కొందర్ని పెద్దయినా ఈ లక్షణం వీడదు. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు బీజేపీ నేత ఎల్ కె అద్వానీ పేరు కూడా నిరభ్యంతరంగా చేర్చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీలోని వివిధ పదవులకు సీనియర్ నేత లాల్ కిషన్ అద్వానీ రాజీనామా చేశారు. అంతకు ముందు రెండు రోజుల పాటు గోవాలో జరిగిన పార్టీ సమావేశాలకు హాజరుకాలేదు కూడా. అందుకు కారణంగా తనకు అనారోగ్యమని సెలవిచ్చారు. బాగానే ఉంది. పెద్దాయిన, అనుభవం పండినవాడు, కాస్త ఆలోచించి కారణం చెప్పాడు అనుకున్నారంతా.

అసలు కారణం, పార్టీలో మోడీది పైచేయి కావడాన్ని ఆయనకు మింగుడుపడకపోవడమే అని అందరికీ తెలుసు. అయినా అద్వానీ చెప్పిన కారణాన్ని స్వాగతించి, సహించి, విని ఊరుకున్నారు. సరే. కానీ అసలు అక్కడితో ఆగలేకపోయింది, సహనం కోల్పోయింది అద్వానీయే కావడం అసలు విశేషం.

భారతీయ జనతాపార్టీకి మాస్క్ గా వుంటూ వచ్చిన వాజ్పేయి, వృద్ధాప్యం కారణంగా పక్కకు తప్పుకోగానే, పీఠం మీదకు వచ్చిన అద్వానీ చిరకాల వాంఛ ఎలాగైనా సువిశాల భారతదేశానికి ప్రధాని కావాలని, తను సాధించిన రథయాత్ర వాజ్పేయిని గద్దె నెక్కించడానికి పనికి వచ్చింది కానీ, తను ఆశించిన తీరానికి తనను చేర్చలేకపోయింది. ఇక మిగిలిన చివరి అవకాశం 2014 ఎన్నికలు. భారతీయ జనతాపార్టీకి  దేశవ్యాప్తంగా సరియైన  యంత్రాంగం లేకపోవచ్చు. ఆరెస్సెస్ దేశవ్యాప్త కార్యవాహక జనం సంఖ్య రానురాను తగ్గుతూ వుండొచ్చు. అయినా ప్రధాన ప్రతిపక్షం అనే నేమ్ బోర్డు మాత్రం మారలేదు. యుపిఎ తన గొయ్యి తానే తవ్వుకుని, తమకు ఏమాత్రం శ్రమ ఇవ్వకుండా, అధికారం అప్పగించకపోదన్న దింపుడు కళ్ళెం ఆశ లేకపోలేదు. అదిగో అలాకలలు కంటూన్న సమయంలో, ఉన్నట్లుంది మోడీ రూపంలో హడావుడి మొదలై ఆ కల చెదిరిపోయే పరిస్థితి వచ్చింది.

నిజానికి ఇక్కడ అద్వానీ పెద్ద మనసుతో ఆలోచించాల్సి వుంది. తాను గడిచిన రెండు దఫాలుగా సాధించలేని, యువతరంలో ఇంతో అంతో క్రేజ్ సంపాదించుకున్న మోడీ సాధిస్తాడేమో అని ఆశించాల్సి వుంది. వయసు మీదపడింది.. భాజపా కోసం మరో రథయాత్ర చేసే శక్తి లేదు. కొత్త తరాన్ని సాదరంగా స్వాగతించి అన్నది పాత తరం నైతిక బాధ్యత. కానీ అద్వానీ అస్సలు ఆ విధంగా ఆలోచించలేకపోయారు. చిన్న పిల్లాడి వ్యవహారంలా అలిగారు. మోడీకి ఎన్ని అడ్డంకులు కలుగచేయాలో, అన్నీ ప్రయత్నించారు. ఆఖరికి పార్టీ అనివార్యంగా అటువైపు మొగ్గుతుంటే, భరించలేక, సమావేశాలకు డుమ్మా కొట్టారు. అప్పుడైనా కాస్త జంకి, మోడీకి పగ్గాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తారేమో అనుకున్నారు. కానీ అనుకున్నట్లు వ్యవహారం సాగలేదు. మోడీ మెడలో పూలమాల పడనే పడింది. సినిమాల్లో విలన్లు తమకు దక్కనిది వేరెవరికి దక్కకూడదని ఆలోచించినట్లు, భాజపాలోని పదవులకు ఆయన రాజీనామా చేశారు. అంటే పార్టీ లుకలుకలు, తలకాయనొప్పులు జనం దృష్టికి వెళ్లాలనేగా ఆయన యోచన. అప్పుడు అంతో ఇంతో వుంటుదనుకున్న ప్రజాదరణ ఉండకుండా పోవాలనేదేగా ఆయన యోచన. పైగా పార్టీ సిద్ధాంతాలకు దూరం జరుగుతోందని ఓ రాయి పడేశారు. మరి ఈయనగారు చేసిందేమిటో? పాకిస్థాన్ వెళ్లి జిన్నాను పొగడ్డం పార్టీ సిద్ధాంతమా? రామాలయం కడతామని రథయాత్ర చేసి, పక్కన పెట్టడమా? ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు ఇస్తామని మభ్యపెట్టి, వదిలేయడమా? అసలు భాజపా ఇప్పుడు ఏ సిద్ధాంతాలు పట్టుకుని వేలాడుతోంది కనుక, అద్వానీ బాధపడడానికి?

అధికారంలో వున్న నాలుగు నాళ్లలో పార్టీ నాయకులు, మంత్రి పదవులు వెలగబెట్టిన వారు ఏ విధంగా కోట్లకు పడగలెత్తారో జనాలకు తెలియదా? రాష్ట్రానికి చెందిన వారు కూడా వివిధ ఏజెన్సీలు ఎలా సంపాదించుకున్నారో, ట్రస్ట్ లు పెట్టి ఎలా ఆర్జించుకుంటున్నారో జనం ఎరుగనిదా? కర్ణాటకలో అవినీతి పంకిలంలో ఇమడలేక కమలం ఎలా ముడుచుకుపోయిందో, ఆ బురద కేంద్రనాయకులకు, అద్వానీ అనుంగు అనుచరులకు ఏ మేరకు అంటిందో తెలియనిదా? మరి రాజీనామ కు అద్వానీ ఇలాంటి సాకు చెప్పడమెందుకు? మోడీ ఫేశ్ నాకు నచ్చలా! అని ఒక్క ముక్క చెబితే పోయేదిగా. అద్వానీకి ఇంత అనుభవం వున్నా, ఒక్క విషయం తెలిసినట్లు లేదు. ఆయన పార్టీని వదిలేసినా, పదవులు వదిలేసినా, నిన్నటి వరకు ఆయన వెంట వున్నవారు ఎవరూ, కూడా రారని, రాజకీయాల్లో నిన్నటి సంగతి అనవసరం. నేడేంటి అన్నదే ముఖ్యం. అది అద్వానీకి పోను పోను బాగా అర్థమవుతుంది. ఇక చేయడానికి ఏమీ మిగల్లేదు. ఆత్మకథ కూడా ఇంతకు ముందే రాసేశారు. అలవాటైన రామజపం చేసుకోవడమే ఉత్తమం. వృద్దాప్యంలో పుణ్యమైనా వస్తుంది. ఇలా కాకుంటే మరేమని చెప్పాలి. మోడీని అభినందించడం, తన వంతు చేయూతనిస్తానని చెప్పడం మాని, మోడీకి పదవి ఇచ్చిన మర్నాడే, ఉక్రోషంతో రాజీనామా చేసిన పెద్ద మనిషికి.

Exit mobile version