Site icon TeluguMirchi.com

Class 1 Admission : ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు


ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకే 1వ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఆరేళ్లు నిండితేనే చిన్నారులకు ఒకటవ తరగతిలో అడ్మిషన్‌ ఇవ్వాలని, వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024-25 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (NEP) 2020, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ (RTE) యాక్ట్‌ 2009 కింద 1వ తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. 3 ఏళ్లు ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, తర్వాత 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్‌ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలనేదే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని కేంద్రం తన లేఖలో పేర్కొంది.

అంతేకాదు అంగన్‌వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేటు, ఎన్‌జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్‌ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రీ స్కూల్‌ విద్యార్థులకు బోధించే టీచర్లను తయారుచేయడానికి.. ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించి, అమలుచేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది.

Exit mobile version