బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన లో 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి పర్యాటకులతో బయలుదేరిన ఓ బస్సులో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో అందులోని 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
బస్సులో మృతదేహాలు ఓ కుప్పగా.. బూడిదగా మారాయని బల్గేరియా మంత్రి బోక్యో రష్కోవ్ పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనను ఇదివరకెన్నడూ చూడలేదన్న ఆయన.. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన అక్కడి పోలీసులు.. సాంకేతిక లోపంతో జరిగిందా? లేక డ్రైవర్ తప్పిదమా? అనే రెండు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. ఈ దుర్ఘటనపై బల్గేరియా ప్రధానమంత్రి స్టీఫెన్ యానెవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.