ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవ జరిగిన మంత్రి వర్గ పునర్విభజన తర్వాత అధికార తెలుగు దేశం పార్టీలో ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకు వచ్చింది. పలువురు ఎమ్మెల్యేలు గత రెండున్నర సంవత్సరాలుగా మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తూ వచ్చారు. అయితే పార్టీలో ఎంతో కాలంగా కష్టపడుతున్న వారిని కాదని వైకాపా నుండి వచ్చిన వారికి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం ఇచ్చాడంటూ ఆరోపిస్తూ పలువురు ఎమ్మెల్యేలు మరియు తెలుగు దేశం నాయకులు రాజీనామాకు సిద్దం అయిన విషయం తెల్సిందే.
ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మంత్రి పదవి దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఒకానొక దశలో ఈయన పార్టీకి గుడ్‌బై చెప్పినట్లే అని అంతా అనుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మంతనాలు జరపడతంతో ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈయనతో పాటు టీడీపీలోని దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహంగా ఉన్నారు.
వీరంతా కూడా పవన్ ఛాన్స్ ఇస్తే జనసేన పార్టీలోకి వెళ్లాలని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగు దేశం పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత అనధికారికంగా మీడియా మిత్రులతో చెప్పుకొచ్చాడు. ఆ 30 మంది ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. పవన్ వారిని ఆహ్వానిస్తాడా అనేది చూడాలి.