దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేరళలో జేఎన్-1 రకం వేరియంట్ వెలుగులోకి రావడంతో.. ఫ్లూ, జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో కొవిడ్ కేసు నమోదైంది. నాలుగైదు రోజుల క్రితం తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారిని వెంటిలేటర్‌పై తీసుకొచ్చారు. చికిత్స అనంతరం, అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నిలోఫర్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం కుదుటపడిందని, వెంటిలేటర్‌ను తొలగించి ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతోందని వైద్యులు తెలిపారు.
మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్ లో నాలుగు, మెదక్ లో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో మరో కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో 19 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే దేశంలోని పలుచోట్ల కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆస్పత్రుల్లో బెడ్‌లు, వైద్య సిబ్బంది సహా ఔషధాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. పరీక్షలను పెంచాలని, నమూనాలను ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలకు పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.