హోం నుంచి సబిత ట్రాన్స్ ఫర్?

CBI-court-to-issue-summons-to-Sabitaహోం మంత్రి సబిత పేరు చార్జిషీట్ లో చేరింది. కీలకమైన ఏ4 గా. రాజీనామాకు ఆమె సిద్ధపడిందని వార్తలు. వాటి సంగతి ఎలా వున్నా, కోర్టు సమన్లు సిద్ధమవుతున్నాయి. ఇంతలో బొత్సకు హస్తిన నుంచి పిలుపురానే వచ్చింది. అయితే ఏంటి..?

ఒక హోం హోదాలో సబిత కోర్టుకు హాజరుకావడం ఎంతవరకు సబబుగా ఉంటుంది? ప్రతిపక్షాలు విమర్శించేందుకు, ప్రజల్లో నగుబాటు కావడానికి ఇంతకన్నా గొప్ప కారణం ఏమీ అక్కర్లేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఒక సమస్య, తప్పించకుంటే మరో సమస్య. ధర్మాన కొనసాగుతున్నారు కాబట్టి సబిత కొనసాగాలి… అంటే కనీసం శాఖయినా మార్చాలిందే. అందుకే ఇప్పుడు హోం ఎవరు? అన్నది తక్షణ ప్రశ్నగా ఎదురవుతోంది. ఇప్పటికే అనుభవం వున్న జానారెడ్డి రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ రెండు సమస్యలున్నాయి. ఒకటి ఆయనపైనా అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణలు ఉండడం, రెండవది ఆ లెవల్ సీనియర్ ను కిరణ్ తన పక్కన హోంగా భరించగలరా? మరి తెలంగాణలో ఇంకెవరు వున్నారు? దుద్దిళ్ల శ్రీధర్ బాబు. యువకుడు, మంచివాడు, సౌమ్యుడు, చురుకైన వాడు అన్న పేరు ఉంది. కానీ ఒక మహిళ స్థానంలో మరో మహిళ అయిన గీతారెడ్డిని ప్రతిపాదించే అవకాశం కూడా లేకపోలేదు. పైగా ప్రాంతం, సామాజికవర్గం వంటి వెసులుబాట్లు కూడా కలిసివస్తాయి.

ఇంకోపక్క హోం మంత్రి పదవిని మళ్లీ ఆంధ్ర ప్రాంతానికి మళ్లించే ప్రయత్నాలు కూడా తెరవెనక జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి సీమ ప్రాంతానికి వున్నందున, కీలకమైన పదవులు తెలంగాణ ప్రాంతానికి ఉన్నందున, ఆంధ్రకు హోం కేటాయించాలన్న ప్రతిపాదనలు తెరవెనక వినిపిస్తున్నాయి. బొత్సకు కూడా ఆ శాఖపై కోరిక వుంది. కానీ అధిష్టానం ఏమంటుందో చూడాలి. ఒకవేళ డిఎస్ కు పిసిసి ఇచ్చి, బొత్సను మంత్రి వర్గానికి పరిమితం చేస్తామంటే, ఆయన హోంను కోరుకోవచ్చు. సరే ఈ సంగతి ఇలా ఉంటే, సబిత మంత్రి పదవి మార్చినా సమస్యే. ఆ విధంగా ఆమె తప్పిదాన్ని కొంతవరకయినా అధిష్టానం అంగీకరించినట్లు అవుతుంది. అలాంటప్పుడు ఏకంగా తప్పించాల్సి ఉంటుంది. కానీ ధర్మానను తప్పించలేదు కదా అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఇన్ని విధాలా సమస్యనుకొని తెచ్చి పెట్టిన సిబిఐను ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగ కట్టడి చేస్తుందో చూడాల్సి ఉంది.