స్పీకర్ పోచారం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి : దాసోజు శ్రావణ్

‘పార్టీ ఫిరాయింపుల పై కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్ వ్యవస్థకే చెంపపెట్టు. కేసీఆర్ రాజకీయ వ్యాపారానికి చరమగీతం. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫిరాయింపు నిరోధక చట్టానికి వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి.” అని కోరారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్. కలకత్తా హైకోర్టు మంగళవారం టీఎంసి ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌ అనర్హత పిటిషన్‌ పై అక్టోబర్ 7 లో నిర్ణయం తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్‌ కు ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపద్యంలో ట్విట్టర్ వేదికగా స్పదించారు దాసోజు శ్రవణ్. ”తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కళ్ళు తెరిచి ఇకనైన తన బాధ్యతని గుర్తించి రాజ్యంగాన్ని కాపాడాలి. గోడ మీద పిల్లిలా వ్యవహరించి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి. కలకత్తా హై కోర్టు ఇచ్చి తీర్పుని గౌరవించి పెండింగ్ లో వున్న అనర్హత పిటీషన్లపై వెంటనే చర్యలు తీసుకొని పార్టీ ఫిరాయించిన ఎమ్మల్యేలని అనర్హులు ప్రకటించాలి” అని కోరారు దాసోజు.

ఇదే సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుని తీవ్రంగా తప్పుపట్టారు దాసోజు. ”రాజకీయాన్ని వ్యభిచారం కంటే నీచమైన స్థాయి దిగజార్చారు కేసీఆర్. సంతలో గొడ్లని కొన్నట్లు ఎమ్మెల్యేలని కొన్నారు కేసీఆర్. రాజకీయ పునఃరేకీకరణ పేరుతో రాజకీయ వ్యభిచారం నడిపారు. స్పీకర్ ఇందులో బాగస్వామ్యం కావడం దురద్రుష్టకరం. కలకత్తా హైకోర్టు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అమలు చేయాలని బెంగాల్ స్పీకర్ కు ఇచ్చిన తీర్పుని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కేసీఆర్ చేస్తున్న రాజకీయ వ్యాపారానికి ఈ తీర్పు చరమ గీతం. ఈ తీర్పుని గౌరవించి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల నుంచి అక్రమంగా టీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.