కరోనా వైరస్ టిడిటి అధికారులను సైతం వదలడం లేదు. ఇప్పటికే 15 మందికిపైగా అర్చకులకు కరోనా పాజిటివ్ రావడంతో శ్రీనివాసం క్వారంటైన్ కేంద్రానికి వారిని తరలించారు. జులై 11 నుంచి 140 మంది టీటీడీ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేసే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని రకాలుగా కరోనాకి బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తున్నా… ఫలితం కనిపించట్లేదు. కొండకు వేర్వేరు రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తుల వల్లే కరోనా సోకుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐతే… టీటీడీ బోర్డ్ ఛైర్‌పర్సన్ వైవీ సుబ్బా రెడ్డి మాత్రం… దర్శనాలు నిలిపివేసే ఆలోచన లేదని చెపుతున్నారు.
శ్రీవారికి కైంకర్యాలు జరిపే అర్చకులు వరుసగా కరోనా బారిన పడుతుంటే… టీటీడీ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. గదికో అర్చకుడు పద్ధతిని శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం తిరుమలలో 23 మంది అర్చకులు విధుల్లో ఉన్నారు. వీరితోపాటూ… మరో ముగ్గురు అర్చకుల్ని తిరుపతి నుంచి రప్పించారు. విశ్రాంతి భవనంలో 30 గదులను అర్చకులకు కేటాయించారు. గదికి ఒక్కరు చొప్పున ఉండేలా చేశారు. అలాగే… సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ… భోజనం చేసేందుకు వంటశాలను కూడా సెట్ చేశారు. అలాగే… అర్చకులను తీసుకెళ్లేందుకు బ్యాటరీ కార్లు కూడా ఏర్పాటు చేశారు.