వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. వైరస్ నిర్థారణ అయ్యిందట. దీనికి బలం చేకూరుస్తూ ఆయన కూడా ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తగా ఓ వారం నుంచి 10 రోజులు క్వారంటైన్‌లోకి వెళ్తున్నానని.. ఈ వారం పది రోజుల పాటు ఫోన్‌లో అందుబాటులో ఉండను అన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ తనకు ఫోన్ చేయొద్దన్నారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని రూమ్ నెంబర్ 223లో ఆయన చికిత్స పొందుతున్నారు.
కాగా విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్త బయటకు రాగానే ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్‌లు, పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు టీడీపీ నేతలు సైతం ఈ మహమ్మారిపై గెలవాలని ఆకాంక్షించారు. ‘విజయసాయిరెడ్డి గారు మీకు నిజంగానే కరోన సంక్రమిస్తే మీరు వైరస్ ని జయించి..రావాలి. టెస్టులు,వైద్యం మన రాష్ట్రం లోనే చేయించుకోండి.మన రాష్ట్ర ప్రజలకి మనోధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది.. విజయోస్తు.. సుఖీభవ’అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
అలాగే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా స్పందించారు. రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్నారు. రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకి అందరం ఒకటే. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.