రెచ్చగొట్టినా..మేం రెచ్చిపోం : అశోక్ బాబు

ashok babuమాది రాజకీయ నిరుద్యోగ ఉద్యమం కాదు.. సమైక్య ఉద్యమం. పదవుల కోసం… కాసుల కక్కుర్తితో ఉద్యమం చేపట్టలేదు.. తెలుగు ప్రజలను విడదీస్తుంటే కడుపు మంటతో ఉద్యమం చేపట్టామని అన్నారు ఎపిఎన్‌జిఓ జెఎసి చైర్మన్ ఆశోక్‌బాబు. ఆదివారం కర్నూలు లో ఎస్‌టిబిసి కళాశాల మైధానంలో జరిగిన సేవ్ ఆంద్ర ప్రదేశ్, సమైక్య ప్రజాగర్జన సభకు హాజరైన అశోక్ బాబు మాట్లాడుతూ… సమైక్యాంధ్ర ఉద్యమంపై తెలంగాణ వాదులు విమర్శలు చేయడం తగదన్నారు. రాయలసీమలో కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానముందని, నల్లమలలో పులులే కాదు వాటిని తరిమే మేకలు కూడా ఉన్నాయన్న విషయాన్ని రాష్ట్ర విభజనవాదులు గుర్తించాలని ఆయన అన్నారు. తమ ఉద్యమంపై రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసినా పట్టించుకోబోమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ నేతలు లేరని ప్రజలున్నారని ఆయన అన్నారు.

కెసిఆర్‌ది అవాస్తవాల ఉద్యమాలన్నారు. సీమాంద్ర ఉద్యమం వాస్తమైనది… న్యాయమైనదన్నారు. కెసిఆర్ సహనం కోల్పోయి అవాక్‌లు, చావక్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాలలో నిజాయితీ ఉండాలన్నారు. ఎవ్వరిది నిజాయితీ ఉద్యమమో తెలుసుకోవాలంటే స్థలం.. తేది కెసిఆరే చెప్పాలని సవాల్ విసిరారు. సీమాంద్ర ఉద్యమాన్ని చులకనగా మాట్లాడవద్దవని కెసిఆర్‌కు హితవు పలికారు. తెలంగాణ సంస్కృతిని తాము ఎప్పుడూ అవమానపరచలేదని, తెలంగాణ ప్రజలు మంచి మనసున్న వారని, కాకపొతే వారి అమాయకత్వాన్ని కొందరు నాయకులు తమ పదవుల కోసం వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే పదవులు మీరే తీసుకోండని, ప్రజలను వేరు చేసి రాష్ట్రాన్ని చీల్చవద్దని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. వర్షాలు పడకపోతే ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఇక తమ ఉద్యమంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా తాము రెచ్చిపోబోమని అన్నారు. తమ ప్రాంత ఎంపీల మెడలు వంచి పార్లమెంటులో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటా మన్నారు. సీమాంధ్ర అంగీకారం లేనిదే తెలంగాణ ఏర్ఫడబోదన్న అంశాన్ని తెలంగాణ వాదులు గుర్తించాలని కోరారు. తెలంగాణను దోపిడీ చేశారన్న ఆరోపణలను ఖండించారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమన్నారు.