కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఈ రోజు దురుసుగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మహిళా దినోత్సవం నాడు ఓ మహిళపై అశోక్ గజపతి రాజు దాడి చేయడం వైరల్ అయ్యింది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అశోక్ గజపతి రాజు విజయనగరంలో సోమవారం ప్రచారం చేపట్టారు. ప్రచారానికి వచ్చిన మహిళపై అశోక్ గజపతి రాజు అకారణంగా చేయి చేసుకున్నారు. తన అభిమాన నేత అశోక్‌పై అభిమానంతో పువ్వులు జల్లుతుండగా.. సహనం కోల్పోయిన అశోక్ గజపతిరాజు విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. అశోక్ గజపతి రాజు ప్రవర్తనకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆశ్చర్యపోయారు.
దీనిపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుష అహంకార భావజాలంతో ఉన్న ఒక మహిళా ద్వేషి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం అని విమర్శించారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం ఆలయానికి గౌరవ చైర్మన్ గా ఉన్నారని, ఇప్పుడాయన తన అసలు రంగు బయటపెడుతున్నాడని సంచయిత వ్యాఖ్యానించారు