కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త్రిసూర్‌లోని టెక్కిన్‌కడ్ మైదానంలో నిన్న జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో జాకబ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జాకబ్ మాట్లాడుతూ అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు.
లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని, అందుకనే బీజేపీలో చేరినట్టు చెప్పారు. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీని సమాయత్తం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న కొచ్చి చేరుకున్నారు.