ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందునుండి కూడా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రవైట్ స్కూల్స్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో తీర్చి దిద్దుతున్నాడు. తాజాగా విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నుండే దీనిని అమలు చేయాలని తెలిపారు. పీపీ-1, పీపీ-2గా ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేయాలని సూచించారు. దానికోసం ప్రత్యేకమైన సిలబస్ ను రూపొందించాలని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు లేవన్నారు. ప్రభుత్వ పాఠశాలల పక్కనే అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి స్థలాలు ఉన్నాయా?లేదా? అని పరిశీలించాలన్నారు. ఒకటవ తరగతికి బోధించే పాఠాలకు పీపీ-1, పీపీ-2 పాఠ్యాంశాల మధ్య సినర్జీ ఉండాలని సూచించారు. ఆవిధంగా పాఠ్యాంశాలను రూపొందించాలన్నారు.