జగన్- శర్మిల.. అంబానీ బ్రదర్స్ ప్లాన్ !

అంబానీ సామ్రాజ్యం ధీరుబాయ్ అంబానీ తర్వాత రెండుగా విడిపోయింది. ఇద్దరు అన్నదమ్ములు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ ఆస్తులు పంచుకొని రెండుగా చీలిపోయారు. ఐతే ఈ చీలిక పై ఇప్పటికీ ఓ వాదన వుంది. అదేంటంటే .. బిజినెస్ కోసం విడిపోయారు తప్పితే లోపల మాత్రం ఒక్కటేనని . కేవలం వ్యాపార ప్రయోజనాలు కోసమే వేరుగా సమాజానికి కనిపిస్తారే తప్పితే వాళ్ళు ఇద్దరు కాదని ఓ కధనం వుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబంలో కూడా ఇలాంటి చీలిక వచ్చిందనేది పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తుంది.

వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. ”రాజన్న రాజ్యం లేదు. ఎందుకు లేదు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి” అనే నినాదంతో ఆమె ముందుకు వెళుతున్నారు. కాగ షర్మిల పార్టీతో ఏపీ సిఎం జగన్ కి సంబంధం లేదని వైసీపీ వర్గాలు ఇప్పటికే చెబుతున్నాయి. ఐతే లోపల విషయం ఏమిటంటే .. షర్మిల పార్టీ వెనుక జగన్ మోహన్ రెడ్డి హస్తం కూడా వుందనే మాట వినిపిస్తుంది. 
తెలంగాణలో గనుకు షర్మిల కొన్ని ఓట్లు, సీట్లు తెచ్చుకోగలిగితే అప్పటికున్న పరిస్థితుల ప్రకారం జగన్ కనుసైగల్లోనే ఎవరికైనా మదత్తు ఇవ్వడం జరుగుతుందని, ఇటు బిజెపి, అటు టీఆర్ఎస్ ఇద్దరికీ జగన్ సమాన దూరంలో వున్నారు కాబట్టి అప్పటికి వున్న సమీకరణలు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు కదులుతారని పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బయటకి జగన్ , షర్మిల వేరుగా కనిపించి లోపల మాత్రం ఒక్కటిగానే వున్నారనేది ఇన్ సైడ్ టాక్.