మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరోసారి వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. తెలంగాణ రాక ముందు మనల్ని అవహేళన చేశారని, ఇండియాలో తెలంగాణ ఎక్కడుందో ఇప్పుడు చెప్పొచ్చని అన్నారు. తెలంగాణ ఇవాళ ఏం చేస్తుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోందని కేటీఆర్ అన్నారు. విశాఖ ఉక్కు విషయంలో కేసీఆర్ స్పందించిన తీరుతో కేంద్రం ఉలిక్కి పడిందని, ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గిందని అన్నారు.
ఇక తెలంగాణలో దళితులు గొప్పగా ఎదుగుతున్నారని, ప్రజాస్వామ్యం లో అందరూ సమానమేనని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికి ఒకే ఓటు హక్కు ఉందని… అదానీకైనా, మనకైనా ఒకటే ఓటు హక్కు అని కేటీఆర్ అన్నారు. మతాలు, కులాలు మనకు మనం పుట్టించుకున్నవేనని అన్నారు.
ఇకపోతే రేపు సీఎం కెసీఆర్ చేతుల మీదుగా దళిత గిరిజనులకు దండు మల్కాపూర్ లో రెండెకరాల స్థలాన్ని ఇప్పిస్తామని కేటీఆర్ అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటేనే అధికారం లేదంటే ఎవరైనా చెత్త బుట్టలో ఉండాల్సిందేనని కేటీఆర్ అన్నారు. దళిత బందు లాంటి పథకం కెసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు తోనే సాధ్యమని అన్నారు. రెండు మొక్కలు నాటమంటే ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి చేత కాదని ఎద్దేవా చేశారు. అది కూడా కేసిఆర్ వల్లనే సాధ్యమని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేది కానీ ఇప్పుడు 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పుడు పండుతోందని అన్నారు. తెలంగాణ వచ్చాక ధరలు భారీగా పెరిగాయని గుర్తుచేశారు. ఇంటింటికి వంద శాతం నీళ్ళు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ దేనని కేటీఆర్ గుర్తుచేశారు. గుజరాత్ లో 12 ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదని కేటీఆర్ గుర్తుచేశారు.
ఎర్రటి ఎండల్లో కూడా రిజర్వాయర్ లో నీళ్ళు నిండుకుండలా ఉన్నాయని.. అయితే నీళ్ళు వచ్చాయా,ఎక్కడున్నాయి అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్లలో నీళ్లు తాను చూపిస్తా రమ్మంటే ఎవడు రావడం లేదని విమర్శించారు. రాకపోగా విమర్శలు చేయడం తగదని కేటీఆర్ అన్నారు. విశాఖ ఉక్కు పైన గట్టిగ మాట్లాడింది మన ముఖ్యమంత్రి కేసిఆర్ అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. మేము తెగించి కొట్లడాము కాబట్టే కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన చేసిందని, తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయం పై వెనక్కి తగ్గిందని కేటీఆర్ అన్నారు.