Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి..

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. కోవిడ్-19 అనుమానిత లక్షణాలు బయటపడటంతో పరీక్ష చేయించుకున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి.. ఈ ఫలితాల్లో వైరస్ పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. ‘తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, తనతో కాంటాక్ట్ అయినవారు, సహచరులు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులు క్వారంటైన్‌కు వెళతారు’అని శివరాజ్‌సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కరోనా సోకుతుందని శివరాజ్ సింగ్ చెప్పారు. తాను కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని, అయితే, చాలా మంది పలు విషయాలపై తనను కలిసేందుకు వచ్చారని, దీంతో కరోనా సోకి ఉండొచ్చని తెలిపారు. కాగా, శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా రిపోర్టులు నిన్న మధ్యాహ్నం వచ్చాయి. ఆయనను వైద్య సిబ్బంది భోపాల్‌లోని చిరాయు ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ మిశ్రా తెలిపారు.

Exit mobile version