ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఈసీ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా ఫిర్యాదు, సమాచారం అందించొచ్చని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. ఐతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేసినా తమకు వ్యతిరేకంగానే చేస్తారని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఆయన నిబంధనల ప్రకారం వ్యవహరించినా అది తమకు వ్యతిరేకం అనుకుంటోంది
ఇప్పుడు… ఎన్నికల పర్యవేక్షణకు… నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొత్తగా యాప్ వాడాలని అధికారులను ఆదేశించడం పై కూడా వైసీపీకి అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో చంద్రబాబే చేయించారని ఆరోపణలు ప్రారంభించారు. ఈ యాప్ వెనుక చంద్రబాబు వున్నారని కూడ చెబుతున్నారు. తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
”అధికారం పోయాక వ్యవస్థలపై కూడా పట్టు జారిపోవడం చంద్రబాబును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఏకగ్రీవాలు ఆపించలేకపోయాడు. నిమ్మగడ్డ ద్వారా ‘ఈ-వాచ్’ యాప్ తో కుట్రలు చేయాలనుకుంటే బెడిసి కొట్టింది. యాప్ ఎక్కడ తయారైందో దర్యాప్తు చేస్తే ఇద్దరూ కటకటాలపాలవుతారు” అని రాసుకొచ్చారు. ఐతే ఆ ఇద్దరూ ఎవరనే విషయం మాత్రం చెప్పలేదు విజయసాయి రెడ్డి.