ఆర్ఎంపీ మృతదేహాన్ని ఊళ్లోకి రానివ్వని గ్రామస్థులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు వందల కేసులు పెరుగుతుండడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఆర్ఎంపీ డాక్టర్ మృతదేహాన్ని ఊళ్లోకి తీసుకురావడానికి గ్రామస్తులు అడ్డుకోవడం సంచలనంగా మారింది.

సంగారెడ్డి జిల్లా నారాయణఖే‌డ్ సమీపంలోని సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో డెడ్ బాడీని సొంతూరు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆర్ఎంపీ కరోనాతో చనిపోవడంతో గ్రామస్తులు మృతదేహాన్ని ఊళ్లోకి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. కరోనాతో చనిపోయాడు కాబట్టి.. ఊరి శివారులో అంత్యక్రియలు నిర్వహించొద్దన్నారు.