ప్రతి మహిళకు పురిటి నొప్పులు పునర్జన్మతో సమానం. తను ఓ బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో వేదన పడుతుంది. ఎన్ని నొప్పులైనా సులభంగా భరిస్తుంది. పురిటినొప్పులతో బాధపడినా తను ఓ బిడ్డకు జన్మనిచ్చానని ఎంతో సంతోషపడుతుంది. పండంటి బిడ్డ పుట్టాక అన్ని బాధలను మరిచిపోతుంది. బిడ్డను కనే సందర్భంలో స్త్రీలకు ఎదురయ్యే పరిస్థితిని మాటల్లో వర్ణించలేం. తొమ్మిది నెలల పాటు కడుపులో పెరిగే బిడ్డ కోసం ఎంతో సంబరపడుతుంది. అయితే ఇప్పుడు కాలం మారింది.. భవిష్యత్తులో ఈ సంతోషం మహిళకు దూరమయ్యే అవకాశం ఉంది. కృత్రిమ బిడ్డను యంత్రాల్లో సృష్టించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫేస్ బుక్, యాపిల్, టెస్లా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు కృత్రిమ మేథస్సును ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతికత ప్రభావంతో తల్లి కడుపులో బిడ్డను పెంచడం ఇష్టం లేని వారికి యంత్రం ద్వారా బిడ్డకు జన్మనిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నారు. దీనికి ఆర్టిఫీషియల్ యుటైరస్ ఫెసిలిటీ అని పేరు కూడా పెట్టారు. ప్రపంచంలోనే తొలి కృత్రిమ పిండం రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాంకేతికతతో శిశువును కృత్రిమ గర్భంలో పెంచుతారు. పిండం దశ నుంచి 9 నెలల తరువాత బిడ్డ బయటకు వచ్చే వరకు మొత్తం యంత్రం ద్వారానే నిర్వహించనున్నారు.
ఆక్టోలైఫ్ అనే సంస్థ కృత్రిమ పిండం నుంచి బిడ్డ పుడుతుందని దీనికి సంబంధించిన ఓ వీడియోను కంపెనీ విడుదల చేసింది. యంత్రం ద్వారా బిడ్డను కనవచ్చని ఈ సంస్థ చెబుతోంది. ఆక్టోలైఫ్ ల్యాబ్ లో ప్రత్యేకంగా స్త్రీ గర్భంలో ఉన్న గర్భాశయాన్ని పోలి ఉండేలా రూపొందించారు. మెషీన్ లో బిడ్డకు కూడా తల్లి పిండం లాంటి అనుభవమే కలుగుతుంది.
ఇక శిశువు చర్మం, పల్స్, ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ స్థాయి, రక్తపోటు, గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలను పర్యవేక్షించడానికి గ్రోత్ పాడ్‌లో సెన్సార్లు ఉంటాయి. అంతే కాకుండా.. శిశువు యొక్క ప్రతి కదలిక , పెరుగుదలను చూడగలిగేలా ఒక యాప్ తయారు చేశారు. ఈ సాంకేతికత కారణంగా.. గర్భాశయం లేని వారికి, తీవ్రమైన అనారోగ్యం కారణంగా దానిని తొలగించిన మహిళలకు తల్లి కావాలనే కల నెరవేరుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.