ఉసేన్ బోల్ట్ హ్యాట్రిక్

Bolt Usainప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ఘనమైన ముగింపు ఇచ్చాడు జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్. పోటీల చివరి రోజైన ఆదివారం చివరి రేసుగా జరిగిన పురుషుల 4X100 మీటర్ల రిలేలో ఉసేన్ బోల్ట్ సభ్యుడిగా ఉన్న జమైకా బృందం 37.36 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తొలుత నెస్టా కార్టర్ రేసును మొదలుపెట్టి తర్వాత కీమర్ బెయిలీ కోల్‌కు బ్యాటన్ ఇచ్చాడు. అతను మూడో సభ్యుడైన నికెల్ అషమెద్‌కు బ్యాటన్ అందించాడు. నికెల్ నుంచి చివరగా బ్యాటన్‌ను అందుకున్న బోల్ట్ ఎప్పటిలాగే వాయువేగంతో పరిగెత్తాడు. జస్టిన్ గాట్లిన్ (అమెరికా) నుంచి గట్టి పోటీ ఎదురైనా బోల్ట్ చివర్లో అబ్బురపరిచే వేగంతో పరుగు తీసి జమైకా జట్టుకు స్వర్ణం అందించాడు. రిలే రేసులో విజయంతో బోల్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో తన స్వర్ణాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకున్నాడు.

విజయం అనంతరం బోల్ట్ మాట్లాడుతూ… గొప్పవాళ్ల జాబితాలో కొనసాగాలన్నదే నా లక్ష్యం. ఇదే తరహాలో మరింతగా కష్టపడుతూనే ఆధిక్యం ప్రదర్శించడాన్ని కొనసాగిస్తాను. జస్టిన్ గాట్లిన్ కారణంగా నేను ఆందోళన చెందలేదు. నాకన్నా ముందే అతనికి బ్యాటన్ దక్కినా నేను అతడిని అందుకోగలననే నమ్మకం ఉంది. సాధ్యమైనంత వేగంగా పరుగెత్తడమే నాకు తెలుసని అన్నాడు ఈ జమైకా చిరుత.